● రైతులు అధైర్య పడొద్దు... ● కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో రైతులు ఎవరూ అధైర్యపడొద్దని, ధాన్యం చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ధాన్యం కొనుగోలు, బడిబాట, జనగణన అంశాలపై సంబంధిత అధికారులతో ఆమె వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ముందుగా జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్, డీఆర్డీఓపీడీ శ్రీనివాసరావు, డీఎస్‌ఓ నిత్యానందలతో ధాన్యం కొనుగోలుపై సమీక్షించారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 71,327 మంది రైతుల నుంచి 3,50,620.680 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. అలాగే 57,496 మంది రైతుల ఖాతాల్లో రూ.616.93 కోట్లు జమ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలోని 200 కొనుగోలు కేంద్రాల్లో ప్రక్రియ పూర్తయిందని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలి..
బడిబాట’ కార్యక్రమంపై డీఈఓ రాజు, చీఫ్ మానిటరింగ్ ఆఫీసర్ రాజు, ఏఎంఓ సుదర్శన మూర్తి, నవీన్‌లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతాన్ని పెంచాలన్నారు. తక్కువ నమోదు ఉన్న పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రీ–ప్రైమరీ పాఠశాలలపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.
పకడ్బందీగా జనగణన..
దేశ అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనకు కీలకమైన జనగణన ప్రక్రియను ఎలాంటి పొరపాట్లు లేకుండా విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమాన్ని పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు. సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి వివరాలను కచ్చితంగా నమోదు చేయాలని, ప్రజలు పూర్తి సమాచారంతో సహకరించాలని కోరారు. జనగణన సిబ్బందికి అవసరమైన శిక్షణ, సామగ్రి అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు.


