పాపన్నపేట(మెదక్): అక్రమంగా ఇసుక తరలిస్తున్న 11 ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. వివరాలు ఇలా... మండల పరిధిలోని కుర్తివాడ శివారులో గల మంజీర నది నుంచి పది రోజులుగా రాత్రింబవళ్లు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు. విషయం తెలుసుకున్న సీసీఎస్ , స్థానిక పోలీసులు అర్ధరాత్రి కాలి నడకన సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అక్కడ రెండు ఇసుక లోడ్‌తో కూడిన ట్రాక్టర్లు, మరో 9 ఇసుక నింపడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో వాటిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, వాటిని తహసీల్దార్ సతీశ్‌కు అప్పగించినట్లు ఎస్సై శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.


