నర్సాపూర్ రూరల్: బాసర త్రిపుల్ ఐటీకి మండలంలోని నాగులపల్లి (బంజారానగర్) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదివిన విద్యార్థి శిరీష ఎంపికయింది. 10వ తరగతిలో 551 మార్కులు సాధించి త్రిపుల్ ఐటీకి ఎంపికై నట్లు హెచ్.ఎం కరుణ సోమవారం తెలిపారు. బాలికను పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.
దారి పొడవునా ధాన్యం లారీలు
హవేళిఘణాపూర్(మెదక్): వరిధాన్యం నిల్వ చేసేందుకు గోదాంలు, రైస్‌మిల్లులు నిండిపోవడంతో ధాన్యం తరలించేందుకు అధికారులు ఎన్‌డీఎస్‌ఎల్ గోదాంను కేటాయించారు. దీంతో మంగళవారం నుంచి నర్సాపూర్– మెదక్ రహదారిపై లారీలు ఇలా బారులుతీరాయి. ధాన్యం తరలింపు సాఫీగా కొనసాగితే రైతుల ఇబ్బందులు తీరుతాయి. ఇక నుంచి రోజుల తరబడి కాకుండా వెనువెంటనే ఆన్‌లోడింగ్ చేసేలా చూడాలని లారీల యజమానులు కోరుతున్నారు. త్వరగా ఖాళీ అయితే తిరిగి మళ్లీ ధాన్యం తీసుకువచ్చేందుకు వీలుంటుందని చెప్పారు.
ప్రమాదవశాత్తు వరికుప్పకు నిప్పు
వెల్దుర్తి(తూప్రాన్): మండలంలోని దామరంచ కొనుగోలు కేంద్రం వద్ద రోడ్డు పక్కన ఉన్న ధాన్యం రాశికి ప్రమాదవశాత్తు నిప్పంటుకుంది. కొనుగోలు కేంద్రానికి అటవీప్రాంతం దగ్గరగా ఉండడంతో, అటవీ ప్రాంతంలో మంటలు అంటుకొని నిప్పు రవ్వలు ఎగిసిపడటంతో గ్రామానికి చెందిన లక్ష్మయ్యకు చెందిన వడ్లరాశికి మంటలు అంటుకున్నాయి. దీంతో చుట్టుపక్కల రైతులు మంటలు ఆర్పివేయడంతో భారీ నష్టం తప్పినట్లయింది.


