శివ్వంపేట(నర్సాపూర్): మండల పరిధిలోని ఉసిరికపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో అసైన్డ్ భూమి అన్యాక్రాంతం అయిన విషయంపై సాక్షి దినపత్రికలో సోమవారం కథనం ప్రచురితమైంది. ఈ వార్తకు గాను రెవెన్యూ సిబ్బంది స్పందించారు. సర్వేయర్ అరుణ్, ఆర్‌ఐ అనితలు సంబంధిత సిమెంట్ ఇటుకల తయారీ పరిశ్రమ ఆధీనంలో ఉన్న భూముల వివరాలు సేకరించారు. ఇందులో ప్రభుత్వ భూమికి సంబంధించి ఐడెంటిఫికేషన్ మ్యాపింగ్ చేపట్టారు. పూర్తిస్థాయిలో సర్వే చేసి ఆక్రమణకు గురైన అసైన్డ్ భూమిని స్వాధీనం చేసుకునేందుకు సదరు పరిశ్రమకు నోటీసులు ఇచ్చి చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కమలాద్రి చెప్పారు.
బీజేపీ నాయకులపై
అసత్య ప్రచారాలు తగదు
టీబీజేపీ రాష్ట్ర నాయకుడు విజయ్
నిజాంపేట(మెదక్): బీజేపీ నాయకులపై అసత్య ప్రచారాలు తగదని టీబీజేపీ రాష్ట్ర నాయకుడు విజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీకి ప్రజల్లో రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక కొంతమంది అసత్య ప్రచారాలకు తెరలేపడం దురదృష్టకరమన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు రాజేంద్ర తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమన్నారు.
చేగుంట తహసీల్దార్‌గా బాలలక్ష్మి
చేగుంట(తూప్రాన్): చేగుంట తహసీల్దార్‌గా బాలలక్ష్మి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన తహసీల్దార్ చిలిపిచెడ్‌కు బదిలీపై వెళ్లగా కలెక్టర్ కార్యాలయం నుంచి బాలలక్ష్మి బదిలీపై ఇక్కడికి వచ్చారు. ఆమె మాట్లాడుతూ మండలంలోని రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం కృషిచేసి రైతులకు తనవంతు సహకారం అందిస్తానన్నారు.
వెల్దుర్తి తహసీల్దార్‌గా విజయలక్ష్మి
వెల్దుర్తి(తూప్రాన్): మండల తహసీల్దార్‌గా విజయలక్ష్మి నియమితులయ్యారు. ఇన్‌చార్జి తహసీల్దార్‌గా పనిచేసిన డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ నుంచి సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. మండలంలో రెవెన్యూ సమస్యలు పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని తహసీల్దార్ ప్రకటించారు. ఏవేని సమస్యలుంటే నేరుగా వచ్చి పరిష్కరించుకోవాలని ప్రజలకు సూచించారు.
ఆర్టీసీని విలీనం చేయాలి
డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జిలతో నిరసన
మెదక్ కలెక్టరేట్: ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని మెదక్ ఆర్టీసీ డిపో కమిటీ చైర్మన్ సంగమేశ్వర్, మేడి రాధాకిషన్‌రావు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మెదక్ డిపో ఎదుట ఎర్ర బ్యాడ్జిలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీజీఎస్ ఆర్టీసీ సమైక్య జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి పిలుపు మేరకు నిరసన చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టీసీ సంస్థతోపాటు ఉద్యోగులను విలీనం చేయాలన్నారు. కార్యక్రమంలో డిపో కమిటీ వైస్ చైర్మన్ నర్సింలు, కన్వీనర్ రాజు, కో కన్వీనర్ వనితారెడ్డి, సత్యం, ప్రభుకుమార్, శేఖర్ పాల్గొన్నారు.
సహకారం సంఘం
చైర్మన్ పదవికి రాజీనామా
బాలకృష్ణారెడ్డి
తూప్రాన్: రైతులను పట్టించుకోని ప్రభుత్వంలో కొనసాగలేక ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ పదవితో పాటు కాంగ్రెస్‌పార్టీకి రాజీనామా చేసినట్లు చైర్మన్ మెట్టు బాలకృష్ణారెడ్డి చెప్పారు. సహకార సంఘం వద్ద సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. సహకార సంఘంలో 1,102 మంది రైతులకు రుణమాఫీకి పంపించగా 370 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. మిగతా రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదన్నారు. అలాగే ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. రైతులు నిలదీస్తే సమాధానం చెప్పలేకపోతున్నట్లు చెప్పారు. నియోజకవర్గ ఇన్‌చార్జి నర్సారెడ్డి సైతం ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, తమకు తగిన ప్రాధాన్యం కల్పించడంలేదని వాపోయారు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసే నాయకులకు గుర్తింపు లేదని విమర్శించారు. ఇలాంటి పార్టీలో కొనసాగడం ఇష్టంలేక రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరో 20 మంది పార్టీకి రాజీనామ చేసినట్లు చెప్పారు.


