చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

Jun 2 2026 7:34 AM | Updated on Jun 2 2026 7:34 AM

చేపలు పట్టేందుకు వెళ్లి వ్యక్తి మృతి

నర్సాపూర్‌ రూరల్‌: చేపల వేటకు వెళ్లిన వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని గూడెంగడ్డలో ఆలస్యంగా వెలుగు చూసింది. నర్సాపూర్‌ ఎస్సై రంజిత్‌ రెడ్డి కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఆవంచ పోచయ్య (53) మే 30వ తేదీ రాత్రి గ్రామంలోని పెద్ద చెరువు వద్దకు వల తీసుకొని చేపలు పట్టేందుకు వెళ్లాడు. ఉదయం వరకు తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతికారు. సోమవారం ఉదయం చెరువులో శవాన్ని గుర్తించిన పశువుల కాపరి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చాడు. పోచయ్య చేపల కోసం వేసిన వల తన కాళ్లకు చుట్టుకొని మృతి చెంది ఉంటాడని పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య కృష్ణవేణి, వివాహాలైన పిల్లలు ఉన్నారు.

వడదెబ్బతో మహిళ మృతి

పాపన్నపేట(మెదక్‌): వడదెబ్బతో ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా... గ్రామానికి చెందిన దూదేకుల సాదక్‌బీ((56)గత నెలలో బక్రీద్‌ పండుగ తెల్లారి తన కూతురుకు శుభాకాంక్షలు తెలిపేందుకు నిజాంపేట మండలంలోని రాంరెడ్డిపేటకు వెళ్లింది. బైక్‌పై వెళ్తుండగా వడదెబ్బకు గురైంది. వెంటనే ఆమెను సంగారెడ్డికి, అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయింది.

పెట్టుబడి సాయం ఇవ్వాలి

రేగోడ్‌(మెదక్‌): రైతులకు పెట్టుబడి సాయం నిధులు మంజూరు చేయాలని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి రమేశ్‌ సోమవారం కోరారు. యాసంగిలో ఇవ్వాల్సిన పెట్టుబడి సాయం డబ్బులు రెండు ఎకరాల వద్ద నిలిచిపోయిందని చెప్పారు. వానాకాలం సీజన్‌ కోసం రైతులు దుక్కులు దున్నుతున్నారని, పెట్టుబడికి రైతులు అవస్తలు పడే అవకాశం ఉందని చెప్పారు. వరిధాన్యం, జొన్నలను చివరి గింజ వరకు కొనాలని ఆయన కోరారు.

టీఆర్‌ఎస్‌ జెండా పండుగ

మెదక్‌ కలెక్టరేట్‌: తెలంగాణ రక్షణ సేన పార్టీ జెండా పండుగను సోమవారం జిల్లా కేంద్రంలోని హెడ్‌ పోస్టాఫీస్‌ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ అధ్యక్షుడు నరేంద్ర యాదవ్‌ పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి చంద్రశేఖర్‌, నియోజవర్గ ఇన్‌చార్జి అజయ్‌, జెండా పండుగా ఇన్‌చార్జి రమేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

చిలప్‌చెడ్‌ తహసీల్దార్‌గా

శివప్రసాద్‌

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): చిలప్‌చెడ్‌ తహసీల్దార్‌గా బదిలీపై వచ్చిన శివప్రసాద్‌ సోమవారం బాధ్యతలు చేపట్టారు. అలాగే మరో ఇద్దరు బదిలీపై వచ్చిన ఆర్‌ఐలు శ్రీహరి, విజయలక్ష్మిలు సైతం విధుల్లో చేరారు. చేగుంట మండలంలో తహసీల్దార్‌గా విధులు నిర్వహించిన శివప్రసాద్‌ చిలప్‌చెడ్‌కువచ్చారు. కౌడిపల్లిలో ఆర్‌ఐగా విధులు నిర్వహించిన శ్రీహరి, నర్సాపూర్‌లో ఆర్‌ఐగా విధులు నిర్వహించిన విజయలక్ష్మి బదిలీపై చిలప్‌చెడ్‌కు వెళ్లారు.

రేగోడ్‌ ఎంపీడీఓగా గంగాధర్‌

రేగోడ్‌(మెదక్‌): రేగోడ్‌ ఇన్‌చార్జి ఎంపీడీఓగా గంగాధర్‌ సోమవారం బాధ్యతలు తీసుకున్నారు. గతంలో ఎంపీడీఓగా పని చేసిన సీతారావమ్మ రంగారెడ్డి జిల్లాకు బదిలీ కాగా.. స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీఓగా పని చేస్తున్న గంగాధర్‌కు ఉన్నతాధికారులు ఎంపీడీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు.

6న బహిరంగ వేలం పాట

శివ్వంపేట(నర్సాపూర్‌): మండల పరిధిలోని చిన్నగొట్టిముక్ల అరణ్యంలో కొలువైన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో కొబ్బరికాయలు, పూజ సామగ్రి విక్రయాల కోసం బహిరంగ వేలంపాట నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీనివాస్‌, ఆలయ ఫౌండర్‌, చైర్మన్‌ ఆంజనేయశర్మ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 5న ఉదయం 11 గంటలకు ఆలయ ప్రాంగణంలో నిర్వహించే వేలంలో పాల్గొనే వారు రూ.2 లక్షలు దరావత్తు చెల్లించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement