నర్సాపూర్: రైతులు పండించిన ధాన్యం అమ్మాలంటే ఇక్కట్లు తప్పడం లేదు. కొనుగోలు కేంద్రాలలో అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. తరలించే సమయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని చిన్నచింతకుంటకు చెందిన రైతు అర్జున్ తాను పండించిన ధాన్యం బస్తాలు సోమవారం ట్రాక్టర్‌లో నర్సాపూర్ ఏఎంసీలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రానికి తరలిస్తుండగా స్పీడ్ బ్రేకర్ల వద్దకు రాగానే బస్తాలకు కట్టిన తాడు పట్టు కోల్పోవడంతో ధాన్యం బస్తాలు రోడ్డుపై పడ్డాయి. వడ్లన్నీ రోడ్డు పాలయ్యాయి. అర్జున్ తోటి రైతుల సాయంతో వడ్లను ఎత్తి బస్తాల్లో నింపి కొనుగోలు కేంద్రానికి తరలించాడు.
తడిసిన ధాన్యం బస్తాలు
కొల్చారం(నర్సాపూర్): వర్షం రైతులను వెంటాడుతూనే ఉంది. కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం బస్తాలు వర్షానికి తడుస్తూ, ఎండకు ఎండుతూనే ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా వీచిన ఈదురు గాలులు, వర్షానికి ధాన్యం బస్తాలు తడిసి ముద్దయ్యాయి. దీంతో రైతులు నానాతంటాలు పడవలసిన పరిస్థితి నెలకొంది. రైతులు ధాన్యాన్ని తరలించేందుకు సొంతంగా ట్రాక్టర్లను సమకూర్చుకుంటున్నప్పటికీ, ధాన్యం నిల్వకు సరైన గోదాములు లేకపోవడం రైతు వేదికల్లో అన్లోడ్ చేయవలసిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం అక్కడ సైతం ధాన్యం బస్తాలు నిండుకోవడంతో పరిస్థితి దారుణంగా మారింది. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం బస్తాలను ఎంతకాలం కాపాడుకుంటూ రావాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నర్సాపూర్ చౌరస్తాలో రోడ్డుపై పడిన వడ్లను బస్తాల్లోకి నింపుతున్న రైతులు
రంగంపేట కొనుగోలు కేంద్రంలో
తడిసిన ధాన్యం బస్తాలు


