పాపన్నపేట(మెదక్): ఏడుపాయల పుణ్యక్షేత్రం ఆదివాదం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ఓడి బియ్యం పోసి బోనాలు తీసి మొక్కు చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలుగకుండా ఆలయ సిబ్బంది, పోలీసులు చర్యలు తీసుకున్నారు.
శక్తిపీఠంలో విశేష పూజలు
శివ్వంపేట(నర్సాపూర్): మండల కేంద్రం శివ్వంపేటలో కొలువైన బగలాముఖీ శక్తిపీఠంలో ఆదివారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో అమ్మవారికి అభిషేకం, మహాపూజా, మహామంత్రహవనం, ఇతర పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ భూదాత పబ్బ రమేష్‌గుప్తా, మాజీ జెడ్పీటీసీ పబ్బ మహేష్‌గుప్తా, తదితరులు ఉన్నారు.
అంజన్నకు ప్రత్యేక పూజలు
శివ్వంపేట(నర్సాపూర్): ఉమ్మడి జిల్లాలో ప్రసిద్ధి చెందిన చిన్నగొట్టిముక్ల అరణ్యంలో కొలువైన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పౌర్ణమిని పురస్కరించుకుని స్వామివారికి పూజారులు ’లక్షనాగవల్లి అర్చన’ మహోత్సవాన్ని కనులపండువగా జరిపారు. ఆదివారం సెలవుదినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
ఉపాధ్యాయుడికి సన్మానం
అల్లాదుర్గం(మెదక్): అల్లాదుర్గం జిల్లా పరిషత్ పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయులు రాజేశ్వర్ ఆదివారం పదవి విరమణ పొందారు. ఉపాధ్యాయుడికి పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయ బృందం శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం పిచ్చయ్య మాట్లాడుతూ.. ఉద్యోగులకు పదవి విరమణ తప్పదని, వారు చేసిన సేవలు ప్రజల్లో గుర్తిండిపోతాయని కొనియాడారు. రాజేశ్వర్ క్రమశిక్షణతో నిధులు నిర్వహించేవారని అన్నారు.
నేడు మెగా ఉచిత
వైద్య శిబిరం
రెడ్ క్రాస్ ప్రధాన కార్యదర్శి
సుభాష్ చంద్రబోస్
మెదక్ కలెక్టరేట్: మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో సోమవారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు రెడ్‌క్రాస్ ప్రధాన కార్యదర్శి సుభాష్ చంద్రబోస్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఉ. 9:30 గంటలకు మేడ్చల్‌లోని మెడిసిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ సౌజన్యంతో మెగా ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కలెక్టరేట్‌లోని అధికారులు, ప్రజలు ఈ వైద్య శిబిరాన్ని సద్వివినియోగించుకోవాలన్నారు. ఈ శిబిరాన్ని కలెక్టర్ ప్రతిమాసింగ్ ప్రారంభిస్తారని తెలిపారు.
చాముండేశ్వరికి
ప్రత్యేక పూజలు
చిలప్‌చెడ్(నర్సాపూర్): మండల పరిధి చిట్కుల్ శివారులో మంజీరా తీరంలో వెలసిన చాముండేశ్వరి అమ్మవారిని ఆదివారం భక్తులు దర్శించుకున్నారు. అర్చకులు ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు చేసి భక్తులకు తీర్థ, ప్రసాదాల వితరణ చేశారు.


