చేగుంట(తూప్రాన్): ప్రభుత్వం ఉద్యోగులందరికీ హెల్త్ స్కీం తీసుకొచ్చామని చెబుతున్నా ఆ స్కీములో లోపాలున్నాయని తపస్ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్ పేర్కొన్నారు. ఆదివారం జిల్లా నాయకులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హెల్త్ కార్డుకు ఎలాంటి నియమ నిబంధనలు విధించకపోయినా ఉద్యోగుల వేతనం నుంచి 1.5 శాతం డబ్బులు వారి అనుమతి లేకుండా తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే దరఖాస్తు చేసుకున్న వారి వేతనం నుంచి మాత్రమే డబ్బులు తీసుకోవాలన్నారు. సమావేశంలో తపస్ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లం, సిద్దూ, జిల్లా నాయకులు శ్రీధర్‌రెడ్డి, నర్సింలు, నాయకులు ఉన్నారు.
జీతంలో కోత విధించడం సరికాదు..
పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సతీష్‌రావు
మెదక్‌జోన్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఆరోగ్య భద్రతను లక్ష్యంగా అమలు చేయనున్న ఎంప్లాయ్ హెల్త్‌స్కీం (ఈహెచ్‌ఎస్) పథకాన్ని స్వాగతిస్తున్నామని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సతీష్‌రావు పేర్కొన్నారు. దానికి సంబంధించిన విధివిధానాలు పూర్తిగా ఖరారు కాకముందే, ఉద్యోగుల వేతనాల నుంచి కోత పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆరోపించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ఈహెచ్‌ఎస్ అమలుకు సంబంధించి అనేక కీలక అంశాలు ఇంకా పూర్తి కాలేదన్నారు. ప్యానెల్ ఆస్పత్రులతో పూర్తిస్థాయి ఒప్పందాలు కుదరక ముందే వైద్య సేవలకు సంబంధించిన ప్యాకేజీ రేట్లు ప్రకటించనే లేదని తెలిపారు. ఉద్యోగులకు నేటికీ డిజిటల్ హెల్త్‌కార్డులు అందజేయలేదు. చందా మినహాయింపుపై స్పష్టమైన ప్రభుత్వ ఉత్తర్వులు జారీ కాలేదు. ఇటువంటి పరిస్థితుల్లో పథకం అమలుకు అవసరమైన మౌలిక ఏర్పాట్లు లేకుండానే మే నెల జీతంలో కోత విధించడం సరికాదన్నారు.
ప్రక్రియ పూర్తి కాకుండానే కోతా?
మెదక్ కలెక్టరేట్: ఈహెచ్‌ఎస్ ప్రక్రియ పూర్తికాకుండానే ఉద్యోగుల వేతనాల్లో కోతలు పెట్టడం ఏమిటని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు యాదగిరి, వెంకట్రాంరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉద్యోగులకు సంబంధించి మే నెల వేతనం నుంచి ఈహెచ్‌ఎస్ కోసం 1.5 శాతం వేతనాన్ని బలవంతంగా మినహాయింపు చేయడాన్ని టీపీటీఎఫ్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. విధివిధానాలు రూపొందించకుండా మినహాయించిన వేతనాన్ని వెంటనే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలన్నారు.
విధివిధానాలు ఖరారు కాలేదు..
నర్సాపూర్: ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో ఎంప్లాయిస్ హెల్త్ స్కీం పేరిట మే నెల వేతనాల్లో కోత విధించ డాన్ని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రావు ఖండించారు. ఆదివారం మండల యూటీఎఫ్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగుల ఆరోగ్య పథకం విధివిధానాలు ఖరారు కాలేదని, ఆస్పత్రులతో ఒప్పందం కుదరలేదని, ఉద్యోగులకు హెల్త్ కార్డులు ఇవ్వకపోయినా ఆర్థిక శాఖ అధికారులు ఉత్సాహంతో ఉద్యోగుల మే నెల వేతనాల నుంచి ఈహెచ్‌ఎస్ చందా పేరిట డబ్బులు కోత విధించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.


