తూప్రాన్: దేవాలయాల్లో చోరీలకు పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఎస్‌ఐ గంగరాజు కేసు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని పెద్దమ్మ ఆలయం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రెండు రోజుల క్రితం చోరీకి పాల్పడిన నిందితులను గుర్తించారు. పట్టణానికి చెందిన కాలకంటి వెంకటేశ్, మహమ్మద్ షరీఫ్ చోరీకి పాల్పడి, ఆలయంలోని విలువైన సామగ్రితో పాటు విగ్రహాలను ఎత్తుకెళ్లారు. విచారణలో నిందితులు ఆలయాల్లో చోరీకి పాల్పడినట్లు అంగీకరించారు. నిందితుల వద్ద నుంచి విగ్రహాలు, పూజా సామగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
గుండెపోటుతో
వార్డు సభ్యుడి మృతి
చేగుంట(తూప్రాన్): గుండెపోటుతో చేగుంట రెండో వార్డు సభ్యుడు సాయిబాబా ఆదివారం మృతి చెందాడు. బీజేపీకి చెందిన బక్క సాయిబాబా(55) చేగుంట రెండో వార్డు సభ్యుడిగా గెలుపొందారు. ఆదివారం తెల్లవారు జామున గుండెపోటుకు గురైన సాయిబాబాను నార్సింగి ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. సాయిబాబా అంత్యక్రియల్లో సర్పంచ్ స్రవంతి పాలకవర్గ సభ్యులు, బీజేపీ సర్పంచులు, ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొని నివాళులర్పించారు.
కేసీఆర్‌ను కలిసిన
ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి: ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ బీఆర్‌ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావును ఆదివారం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను పలకరించి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.


