నర్సాపూర్ రూరల్: నాగులపల్లి కొనుగోలు కేంద్రం నుంచి ధాన్యాన్ని తరలించి, తమను నష్టాల నుంచి గట్టెక్కించాలని స్థానిక రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ, నేటికీ దాదాపు 80 శాతం మంది రైతుల ధాన్యాన్ని తూకం వేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు సార్లు కురిసిన అకాల వర్షాల కారణంగా కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. రోజుల తరబడి నిలిచిపోవడంతో కొన్నిచోట్ల ధాన్యం మొలకలు కూడా వచ్చాయి. ఆరుగాలం కష్టపడి, పెట్టుబడులు పెట్టి పండించిన పంట కళ్లముందే నాశనమవుతుంటే ఏం చేయాలో పాలుపోవడం లేదని రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి నాగులపల్లి కొనుగోలు కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని త్వరితగతిన తూకం వేసి, మిల్లులకు తరలించేలా తగిన ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు.


