కొనుగోళ్లు వేగవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు వేగవంతం చేయాలి

May 31 2026 11:58 AM | Updated on May 31 2026 11:58 AM

చిలప్‌చెడ్‌(నర్సాపూర్‌): ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. శనివారం మండల పరిధిలోని గౌతాపూర్‌ శివారులోని గోదాంను సందర్శించి మాట్లాడారు. మండలంలో కొనుగోలు చేసిన తడిసిన ధాన్యాన్ని నర్సాపూర్‌లో గల రెండు గోదాంలకు పంపిస్తామని, మిగితా ధాన్యం దక్కన్‌ ఆగ్రో గోదాంలో ఖాళీ చేయిస్తామన్నారు. గోదాంలో ఎక్కువ ధాన్యం బస్తాలు ఖాళీ చేసే విధంగా కూలీలను పెంచాలన్నారు. అదేవిధంగా రైతులు తమ సొంత ట్రాక్టర్లలో తీసుకువచ్చిన ధాన్యాన్ని వెంటవెంటనే ఖాళీ చేయించాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి తహసీల్దార్‌ జహీర్‌, రెవెన్యూ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

నేడు విద్యుత్‌ సరఫరాలో

అంతరాయం

హవేళిఘణాపూర్‌(మెదక్‌): మండల పరిధిలోని ఆయా గ్రామ శివారుల్లో విద్యుత్‌ లైన్ల మరమ్మతుల కారణంగా ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏఈ నవీన్‌ తెలిపారు. మండల పరిధిలోని రాజ్‌పేట, వాడి, తొగిట, హవేళిఘణాపూర్‌, నాగాపూర్‌ సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందన్నారు. ప్రజలు గమనించి సహకరించాలని కోరారు.

ఉద్యోగుల అనుమానాలు నివృతి చేయాలి

మెదక్‌జోన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయుల హెల్త్‌కార్డులకు సంబంధించిన సందేహాలను ప్రభుత్వం నివృతి చేయాలని తపస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. హెల్త్‌కార్డుల గురించి ప్రభుత్వ ఉద్యోగుల మూల వేతనం నుంచి 1.5 శాతం మినహాయింపు చేస్తామని చెబుతున్నారే తప్ప, ఇందుకు సంబంధించిన విధి విధానాలు చెప్పలేదన్నారు. ఉద్యోగులకు ఏ ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తారు..? ఎన్ని రకాల వ్యాధులకు కవరేజీ ఉంటుంది..? వాటికి సంబంధించిన ఆస్పత్రుల జాబితా ప్రకటన నేటికీ చెప్పలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఉపాధ్యాయుల సందేహాలు, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపించాలంటూ డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సిద్దు, జిల్లా ఉపాధ్యక్షులు మాధవరెడ్డి, నర్సింలు, ప్రసాద్‌, మంగ నర్సింలు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన టీజీపీఎస్‌సీ పరీక్షలు

వర్గల్‌(గజ్వేల్‌): గౌరారం కావేరి విశ్వవిద్యాలయంలో ఈనెల 23 నుంచి కొనసాగుతున్న టీజీపీఎస్‌సీ డిపార్ట్‌మెంటల్‌ పరీక్షలు శనివారం ముగిశాయి. చివరి రోజు ఉదయం సెషన్‌లో 71 మందికి 57, మధ్యాహ్నం సెషన్‌లో 136 మందికి 113 మంది అభ్యర్థులు కలిపి మొత్తం 170 మంది హాజరైనట్లు కావేరి వైస్‌ చాన్స్‌లర్‌ డాక్టర్‌ వెల్చాల ప్రవీణ్‌రావు పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement