న్యూస్‌రీల్
నిప్పు.. భూసారానికి ముప్పుగా మారుతోంది. యాసంగి వరి కోతలు పూర్తి కావడంతో రైతులు వానాకాలం సాగుకు సమాయత్తం అవుతున్నారు. ఈ క్రమంలో వరి కొయ్యలకు నిప్పు పెడుతున్నారు. ఇది శ్రేయస్కరం కాదని వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు పేర్కొంటున్నారు. పర్యావరణానికి నష్టమే కాకుండా, భూమిలో పోషకాలు, పంటలకు మేలు చేసే కీటకాలు చనిపోయి చీడ పీడలకు ఆస్కారం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
– మెదక్‌జోన్
జిల్లావ్యాప్తంగా 4 లక్షల పైచిలుకు సాగు భూములు ఉండగా, ఏటా యాసంగి, వానాకాలం సీజన్‌లలో 2.80 నుంచి 3.95 లక్షల ఎకరాల వరకు వరి సాగవుతోంది. కాగా పంట కోయగానే రైతులు వెంటనే వ్యర్థాలకు నిప్పు పెట్టి కాల్చేస్తున్నారు. ఈ విధానాన్ని పంట సాగులో భాగం చేశారు. దీని వల్ల భూసారం దెబ్బతింటుందని వ్యవసాయశాఖ అధి కారులు చెబుతున్నారు. అయితే పంట వ్యర్థాలను తగులబెట్టడంతో వాయు కాలుష్యం పెరుగుతుంది. పొగతో పాటు బూడిద గాలిలో కలిసి శ్వాసకోశ సమస్యలు, అలర్జీలు పెరుగుతాయి. అలాగే పంటలకు మేలు చేసే వానపాములతో పాటు బ్యాక్టీరియా చనిపోతుంది. గాలి కలుషితం అవుతుంది. పీల్చిన వారు అనారోగ్యాల బారిన పడతారు. నేల ఆరోగ్యం సైతం దెబ్బతిని దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. పొగతో ఓజోన్ పొర దెబ్బతిని పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుంది.
కలియదున్నితే లాభాలు
వరి కోతలు పూర్తి కాగానే నేల గట్టి పడిన అనంతరం నీరు పెట్టి రోటావేటర్‌తో వరి కొయ్యలు, ఇతర అవశేషాలను పొలంలోనే కలియదున్నితే వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఫలితంగా భూసారం మరింత పెరిగి పంట దిగుబడులు పెరుగుతాయి. రసాయన ఎరువులు చాలా తక్కువ మోతాదులో వేసినా సరిపోతుంది.
ప్రభుత్వం కఠిన చర్యలు
పంట వ్యర్థాలను కాల్చడాన్ని నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జీఓ నెంబర్ 27 ప్రకారం సాధారణంగా వ్యవసాయ వ్యర్థాలు కాల్చి తే రూ.5000, భారీ స్థాయిలో కాల్చితే రూ.25 వేల వరకు పర్యావరణ పరిహారం కింద జరిమానా రూపంలో వసూలు చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా కాల్చిన వారు శిక్షార్హులు అవుతారని హెచ్చరించింది.
ఆస్తి, ప్రాణాలకు ప్రమాదమే
పది రోజుల క్రితం మెదక్ మండలం పేరూరుకు చెందిన ఓ రైతు 105 బస్తాల ధాన్యాన్ని పండించాడు. లారీ రావటం ఆలస్యం కావటంతో వాటిని తన పొలం సమీపంలోని రోడ్డు పక్కన నిల్వ ఉంచాడు. గ్రామానికి చెందిన మరో రైతు తన పొలంలోని వరి కొయ్యలకు నిప్పు పెట్టాడు. గాలి వీయటంతో మంటలు వ్యాప్తించి ధాన్యం బస్తాలకు అంటుకుంది. దాదాపు 25 బస్తాల ధాన్యం కాలిబూడిదయింది. ఏటా ఇలాంటి ఘటనలు జిల్లాలో పదుల సంఖ్యలో జరుగుతున్నాయి. కొంత మంది రైతులు మంటల్లో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన సంఘటన లు ఉన్నాయి.


