అర్హత లేని వైద్యం.. ప్రాణాపాయం | - | Sakshi
Sakshi News home page

అర్హత లేని వైద్యం.. ప్రాణాపాయం

May 30 2026 8:41 AM | Updated on May 30 2026 8:41 AM

తూప్రాన్‌: అర్హత లేని వైద్యంతో కొందరు ప్రజారోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. కట్టడి చేయాల్సిన అధికారులు నోటీసులే ఘనం అన్నట్లు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. మండల కేంద్రంలో వచ్చీరాని వైద్యంతో అనర్హులు డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. పట్టణంలో ప్రాథమిక చికిత్స కేంద్రం పేరిట ఓ మహిళ వైద్యం అందిస్తున్నారు. ఎలాంటి అర్హత పత్రాలు లేనప్పటికీ గర్భిణులు, మహిళలకు చికిత్స చేస్తున్నారు. పట్టణంతో పాటు చుట్టు పక్కల గ్రామాల నుంచి నిత్యం రోగులు వస్తున్నారు. ఆమె సూచనలు, సలహాలు పాటిస్తున్నారు. సొంతింట్లో సాగే ఈ వైద్యంతో అమాయకుల నుంచి డబ్బులు దండుకుంటున్నారు. డీఎస్పీ, ఆర్డీఓ స్థాయి అధికారులతో కూడిన డివిజన్‌ కేంద్రంలోనే ఇలాంటి పరిస్థితి నెలకొనడం వైద్యశాఖ నిఘా లోపం, నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది.

తనిఖీలు, సామగ్రి జప్తు

పట్టణంలో అర్హత లేకుండా మహిళ వైద్యం చేస్తున్నారనే అనుమానంతో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ జ్ఞానేశ్వర్‌ ఏప్రిల్‌ 14న తనిఖీలు నిర్వహించగా, ఎలాంటి అర్హత పత్రాల చూపలేదు. దీంతో వైద్యం కోసం వినియోగిస్తున్న సామగ్రి, ఫర్నీచర్‌ జప్తు చేశారు. ఆ తర్వాత ఎలాంటి వైద్యం చేయవద్దని హెచ్చరించారు. ఆ తర్వాత కొద్ది రోజులు వైద్య సేవలకు దూరంగా ఉండి, తిరిగి యథావిధిగా వైద్య చికిత్స కొనసాగిస్తున్నారు. విషయం తెలిసిన అధికారులు తాజాగా ఈనెల 2న మరోసారి దాడులు నిర్వహించారు. పీసీపీఎన్‌డీసీ యాక్ట్‌కు విరుద్ధంగా స్కానింగ్‌లకు ప్రొత్సహిస్తున్నారని పేర్కొంటూ, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఆ మహిళకు నోటీసులు జారీ చేశారు. 15 రోజుల వ్యవధిలో పూర్తి ఆధారాలు సమర్పించాలని ఆదేశించారు. అయితే గడువు ముగిసి 10 రోజులు అవుతున్నా, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా, నిరాటంకంగా ఆ మహిళ వైద్యం కొనసాగుతున్నాయి. ఇదే విషయమై డీఎంహెచ్‌ఓను ఫోన్‌ ద్వారా ‘సాక్షి’ సంప్రదించే ప్రయత్నం చేయగా స్పందించడానికి నిరాకరించారు.

చోద్యం చూస్తున్న అధికారులు

నోటీసులకే పరిమితం

Advertisement
 
Advertisement
Advertisement