అన్నదాత ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

అన్నదాత ఆగ్రహం

May 28 2026 8:43 AM | Updated on May 28 2026 8:43 AM

● కొనుగోళ్లలో జాప్యంపై ఆందోళన ● జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు

మెదక్‌కలెక్టరేట్‌/వెల్దుర్తి(తూప్రాన్‌)/చిలప్‌చెడ్‌/కొల్చారం(నర్సాపూర్‌): ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ జిల్లావ్యాప్తంగా రైతులు బుధవారం రోడ్డెక్కారు. వెల్దుర్తి మండలంలోని ఉప్పులింగాపూర్‌లో ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈసందర్భంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ రోడ్డుపై ధాన్యం బస్తాలు ఉంచి నిప్పుపెట్టి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులు, ఆర్‌ఐ సర్దిచెప్పడంతో ఆందోళన విరమించారు. అనంతరం గ్రామ సమీపంలోని బ్రిడ్జిపై వాహనాలు అడ్డుపెట్టి మరోసారి ధర్నాకు దిగారు. కొల్చారం మండలంలోని చిన్నఘనాపూర్‌, రంగంపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పరిధిలోని గ్రామాల రైతులు మెదక్‌–జోగిపేట రహదారిపై తడిసిన ధాన్యం బస్తాలతో రాస్తారోకోకు దిగారు. అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని హవేళిఘణాపూర్‌ మండలం సర్ధన గ్రామ రైతులు కలెక్టరేట్‌కు చేరుకొని ధర్నా చేపట్టారు. స్పందించిన అదనపు కలెక్టర్‌ నగేశ్‌ లారీలను త్వరగా పంపించి ధాన్యం కొనుగోళ్లు వేగవంతంగా పూర్తయ్యేలా చర్యలు చేపడుతామని హామీ ఇచ్చారు. అలాగే చిలప్‌చెడ్‌ మండల పరిధిలోని చిట్కుల్‌ చౌరస్తా వద్ద రైతులు రాస్తారోకో చేపట్టారు. దీంతో అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇన్‌చార్జి తహసీల్దార్‌ జహీర్‌తో పోలీసులు రైతు లు ముందే ఫోన్‌లో మాట్లాడారు. గంటలో 5 లారీలు ఏర్పాటు చేస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ధర్నా విరమించారు.

చిలప్‌చెడ్‌: చిట్కుల్‌ చౌరస్తా వద్ద రైతులకు నచ్చచెబుతున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement