శివ్వంపేట(నర్సాపూర్): నర్సాపూర్ ప్రజల తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు మిషన్ భగీరథ పథకంలో భాగంగా అప్పటి ప్రభుత్వం గోదావరి నీటిని తరలించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది. నిధులు మంజూరు చేసి పనులు కూడా చేపట్టారు. ఇందులో భాగంగా నీటి నిల్వ కోసం శివ్వంపేట వద్ద 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో భారీ సంపు నిర్మాణం చేపట్టి పూర్తి చేసింది. పనులు పూర్తయినా ఈ సంపు ప్రస్తుతం నిరుపయోగంగా మారడం గమనార్హం.
రూ. 30 కోట్ల కేటాయింపు
గజ్వేల్ నియోజకవర్గం కొమటిబండ నుంచి గోదావరి జలాలను (హెచ్‌ఎండబ్ల్యూఎస్ ద్వారా) నర్సాపూర్ నియోజకవర్గానికి తరలించేందుకు గత ప్రభుత్వం రూ. 30 కోట్లు కేటాయించింది. రివర్స్ పంపింగ్ పద్ధతిలో ఇక్కడికి నీటిని తరలించే ప్రక్రియను చేపట్టారు. కొమటిబండ నుంచి నర్సాపూర్ పీర్లగుట్ట వరకు ఉన్న 45 కిలోమీటర్ల పైప్‌లైన్‌లో సుమారు 16 కిలోమీటర్ల మేర కొత్త లైన్‌ను ఏర్పాటు చేశారు. నర్సాపూర్‌లోని పీర్లగుట్ట వరకు నీటిని తరలించి, అక్కడి నుంచి నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలన్నది ఈ పథకం ముఖ్యఉద్దేశం.
నిరుపయోగంగా 8 లక్షల లీటర్ల సంపు
గోదావరి జలాల తరలింపులో భాగంగా శివ్వంపేటలో నిర్మించిన భారీ సంపు ప్రస్తుతం వృథాగా ఉంది. కొమటిబండ నుంచి ఏర్పాటు చేసిన ప్రధాన పైప్‌లైన్ కొన్ని చోట్ల పాడైపోవడంతో నీటి సరఫరా నిలిచిపోయింది.
మంజీరా, గోదావరి నీటి కలయికే ఏకై క మార్గం
శివ్వంపేటలో నిర్మించిన సంపులోకి గోదావరి జలాలు వచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. ఈ సంపులోనే మంజీరా, గోదావరి నదుల నీటిని కలిపి సరఫరా చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం సింగూరు ప్రాజెక్టు మరమ్మతు పనుల కారణంగా నీరు నిల్వ లేకపోవడంతో.. 15 రోజులుగా గ్రామాలకు మంజీరా నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రజలు తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా గోదావరి నీటిని అందుబాటులోకి తీసుకొస్తేనే తాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయి.
శివ్వంపేటలో నిరుపయోగంగా ఉన్న సంపు
రూ.30 కోట్లు ఖర్చు చేసినా తీరని దాహార్తి
పైప్‌లైన్ మరమ్మతులకు నోచుకోక నిలిచిపోయిన సరఫరా
15 రోజులుగా నీటి సరఫరా బంద్
తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు


