నర్సాపూర్: కిషోర బాలికలు ఆరోగ్యంపై జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ చైర్‌పర్సన్ లక్ష్మి సూచించారు. ప్రజాపాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంలో కిషోర బాలికలకు హెల్త్ స్క్రీనింగ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బాలికలు పౌష్టికాహారం తీసుకోవాలని, ప్రభుత్వం ఇచ్చే వ్యాక్సిన్లు వేయించుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కమిషనర్ సాయికుమార్, డాక్టర్ సునీత మెప్మా ఇన్‌చార్జి పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా పలువురు బాలికలకు పలు టెస్టులు నిర్వహించారు.
పకడ్బందీగా జనగణన నిర్వహణ
పెద్దశంకరంపేట(మెదక్): ఎన్యూమరేటర్లు పకడ్బందీగా జనగణన నిర్వహించాలని తహసీల్దార్ ప్రభుదాస్ పేర్కొన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద ఎన్యూమరేటర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్యూమరేటర్లకు కేటాయించిన ఇళ్ల వివరాలు సక్రమంగా నమోదు చేయాలన్నారు. సూపర్‌వైజర్లు, ఎన్యూమరేటర్ల సమస్యలపై చర్చించాలని, ఇబ్బందులు లేకుండా జనగణన పూర్తి చేయాలని చెప్పారు.
కొనుగోలు కేంద్రాల పరిశీలన
పెద్దశంకరంపేట(మెదక్): మండలంలోని జూకల్, కొత్తాపేట, కమలాపూర్, బూర్గుపల్లి తదితర గ్రామాల్లో కొనసాగుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహసీల్దార్ ప్రభుదాస్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఐకేపీ సిబ్బందికి పలు సూచనలిచ్చారు. ధాన్యం వెంటవెంటనే తరలించేలా చర్యలు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. లారీల కొరత, ధాన్యం అన్‌లోడింగ్ విషయాలపై మిల్లర్లతో చర్చించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు పెరుమాండ్లుగౌడ్, సీసీలు పాల్గొన్నారు.
ఎల్‌ఓసీ అందజేత
కౌడిపల్లి(నర్సాపూర్): బాధిత కుటుంబానికి రూ 2.25లక్షల ఎల్‌ఓసీ మంజూరయింది. శనివారం మండల పరిధి వెంకట్రావ్‌పేటకు చెందిన లక్ష్మణ్‌గౌడ్ కూతురు అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. ఈ మేరకు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఎల్‌ఓసీ అందచేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కుతుబుద్దీన్, రాజయ్య తదితరులు ఉన్నారు.
కరాటేతో ఆత్మరక్షణ
కొల్చారం(నర్సాపూర్): ఆపదలో ఎదుటి వారి ని ఎదుర్కొనేందుకు కరాటే ఒక సాధనం. ఆడపిల్లల తల్లిదండ్రుల ఆలోచన విధానం మారి.. వారి పిల్లలను కరాటేలో నైపుణ్యం సాధించేలా తర్ఫీదు ఇస్తున్నారు. మండలంలోని రంగంపేట ఉన్నత పాఠశాలలో వేసవి క్రీడాశిక్షణ శిబిరంలో భాగంగా పిల్లలకు వాలీబాల్,కరాటేలో శిక్షణ ఇస్తున్నారు. ఆడపిల్లలు ఎక్కు వగా హా జరై కరాటే నేర్చుకుంటున్నారు. కరాటే మాస్టర్ మల్లేశం ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తున్నారు.
కొనుగోళ్లు సజావుగా సాగేలా చూస్తాం
గజ్వేల్: గజ్వేల్ మార్కెట్ యార్డు పరిధిలోని గజ్వేల్, జగదేవ్‌పూర్ మండలాల్లో వరి, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూస్తామని మార్కెట్ కమిటీ చైర్మన్ నరేందర్‌రెడ్డి చెప్పారు. శనివారం ఆయన మాట్లాడుతూ 22 వరకు 74,554 క్వింటాళ్ల వడ్లు, 26,090 క్వింటాళ్ల మొక్కజొన్న, మరో 3,654 క్వింటాళ్ల పొద్దుతిరుగుడు కొనుగోళ్లు జరిగాయన్నారు.


