అల్లాదుర్గం(మెదక్): గ్రామస్థాయిలోనే రెవెన్యూ సమస్యలను పరిష్కరించి, ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అల్లాదుర్గం మండలానికి నలుగురు జీపీఓలను నియమించింది. వీరిని అల్లాదుర్గం, చిల్వెర, కాయిదంపల్లి, బహిరన్‌దిబ్బ క్లస్టర్లకు కేటాయించారు. వీరు నిరంతరం గ్రామాల్లోనే ఉంటూ స్థానిక రెవెన్యూ సమస్యలను పరిష్కరించాల్సి ఉండగా, క్లస్టర్ గ్రామాలకు కేవలం చుట్టపుచూపుగా వచ్చి వెళ్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. రైతులకు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన జీపీఓలు గ్రామాల్లో ఉండకపోవడంతో, ప్రజలు తమ సమస్యల కోసం ఎప్పటిలాగే తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జీపీఓలతో తహసీల్దార్ కార్యాలయంలోనే పనులు చేయిస్తుండటం గమనార్హం. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ ఈ విషయంపై స్పందించి, విచారణ జరిపి గ్రామపరిపాలన అధికారులు స్థానికంగా గ్రామాల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇష్టారాజ్యంగా విధులు
తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సిబ్బంది ఉ.11 గంటలు దాటిన తర్వాతే విధులకు హాజరవుతుండగా, మరికొందరు కార్యాలయంలో ఉంటూ సెల్‌ఫోన్లలో కాలక్షేపం చేస్తున్నారు. శనివారం సాక్షి ప్రతినిధి కార్యాలయాన్ని సందర్శించిన సమయంలో ఓ ఉద్యోగిని విధులను పక్కనబెట్టి ఫోన్‌లో రీల్స్ చూస్తూ కెమెరాకు చిక్కడం ఇక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. సిబ్బంది విధుల్లో ఇంతటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నా పైఅధికారులు పట్టించుకోవడం లేదని, దూరప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చే తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు ఆరోపిస్తున్నారు.
● తహసీల్దార్ కార్యాలయంలోనే తిష్ట..
● ఫోన్లతో కాలక్షేపం


