మంచినీటి ట్యాంక్‌.. మురికికూపం! | - | Sakshi
Sakshi News home page

మంచినీటి ట్యాంక్‌.. మురికికూపం!

May 24 2026 11:22 AM | Updated on May 24 2026 11:22 AM

కొల్చారం(నర్సాపూర్‌): గ్రామపంచాయతీలో నిధుల లేమియా? లేక అధికారుల నిర్లక్ష్యమా? రక్షిత మంచినీటి ట్యాంక్‌ చుట్టూ పేరుకుపోయిన మురికి గ్రామాభివృద్ధికి అద్దం పడుతోంది. మండలంలోని తుక్కాపూర్‌ గ్రామ ప్రవేశానికి ముందే, ప్రాథమిక పాఠశాల పక్కన ఉన్న రక్షిత మంచినీటి ట్యాంకు చుట్టూ నీరు నిలిచిపోయి మురికికూపాన్ని తలపిస్తోంది. ట్యాంకు నుంచి గ్రామాల్లోకి వెళ్లే ప్రధాన పైపులైన్లు సైతం మురికి నీటిలోనే ఉండడం గమనార్హం. పైపులైన్లలో ఏమాత్రం లీకేజీ ఏర్పడినా.. ఆ మురికి నీరే నేరుగా ఇళ్లకు సరఫరా అయ్యే ప్రమాదకర పరిస్థితి నెలకొంది. అదే గనుక జరిగితే గ్రామ ప్రజలు తీవ్రమైన రోగాల బారిన పడడం ఖాయమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. దీనికి తోడు, పక్కనే ఉన్న పశువుల తొట్టిలోకి కూడా ఈ మురికినీరు కలిసే ప్రమాదం పొంచి ఉంది. మరోకొన్ని రోజుల్లో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. స్కూల్‌ పక్కనే ఈ మురికి నీటి గుంట ఉండడంతో, చిన్నారులు అటువైపుగా వెళ్లి ప్రమాదాల బారిన పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికై నా అధికారులు తక్షణమే స్పందించి, రక్షిత మంచినీటి ట్యాంకు చుట్టూ ఉన్న మురికిని తొలగించి, పైపులైన్లను పునరుద్ధరించాలని గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement