చేగుంట(తూప్రాన్): అక్రమంగా భూమిని తన పేరుపై మార్చుకున్న వ్యక్తిపై చర్యలు తీసుకొని.. తమ భూమిని ఇప్పించాలని బాధిత రైతు కుటుంబం మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. మాసాయిపేట మండలం పోతాన్‌పల్లి గ్రామానికి చెందిన బర్రె సత్తయ్య కుటుంబీకులకు సర్వే నం.203లో 25 గుంటల భూమి ఉండగా 30 ఏళ్లుగా సాగు చేసుకొని జీవిస్తున్నారు. రెవెన్యూ శాఖలో పనిచేసే అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి సంబంధిత భూమిని తన పేరుపై రికార్డులను మార్పు చేయించి భూమి తనదేనని దౌర్జన్యం చేస్తున్నాడని సత్తయ్య ఆరోపించారు. విచారణ చేసి తమకు న్యాయం చేయాలని సత్తయ్య కుటుంబీకులు తహసీల్దార్ జ్ఞానజ్యోతికి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఎంఆర్‌పీఎస్ నాయకులు పరమేశ్, భాస్కర్, బాలుతో పాటు బాధిత కుటుంబీకులు తదితరులు ఉన్నారు.


