కర్షకుల కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

కర్షకుల కన్నెర్ర

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

హవేళిఘణాపూర్‌(మెదక్‌): తూకం వేసిన ధాన్యం తరలించేందుకు లారీలు రావడం లేదంటూ మండల పరిధిలోని గంగాపూర్‌ రైతులు శుక్రవారం మెదక్‌– రామాయంపేట జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. తాము పండించిన పంటలు కొనుగోలు చేయకుండా ప్రభు త్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించా రు. తూకం వేసిన ధాన్యం తరలించమని మొర పెట్టుకున్నా ఏ అధికారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ఆందోళన విరమించారు.

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన

మెదక్‌ కలెక్టరేట్‌: ధాన్యం తరలించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు మండిపడ్డారు. శుక్రవారం హవేళిఘణాపూర్‌ మండలం కొత్తపల్లి రైతులు కలెక్టరేట్‌ ఎదుట ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మూలుగుతుందన్నారు. ఇప్పటికే అకాల వర్షాలు పడుతుంటే ధాన్యం తడిసిపోయే పరిస్థితి ఉందన్నారు. వారానికో లారీ వస్తుందని, దీంతో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు పేరుకుపోయినట్లు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు నచ్చజెప్పినప్పటికీ వినిపించుకోలేదు. తహసీల్దార్‌ సింధు రేణుక వచ్చి తాను రేపు లారీలను పంపిస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

లారీల కోసం మాటు

చిన్నశంకరంపేట(మెదక్‌): ధాన్యం తరలించేందుకు అవసరమైన లారీలు సమకూర్చేందుకు అ ధికారులు చర్యలు ప్రారంభించారు. తహసీల్దార్‌ గ్రేసిబాయి, ఎస్‌ఐ సృజన పోలీస్‌ సిబ్బందితో కలిసి శుక్రవారం నార్సింగి జాతీయ రహదారిపై ఖాళీగా వెలుతున్న లారీలను గుర్తించి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పంపించారు. ఈసందర్భంగా తహసీల్దార్‌ గ్రేసిబాయి మాట్లాడుతూ.. రైతుల ధాన్యం తరలించేందుకు హైవేపై ఖాళీ లారీలను గుర్తిస్తున్నట్లు తెలిపారు.

పెండింగ్‌ కేసులు పూర్తి చేయండి

ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

రేగోడ్‌(మెదక్‌)/పెద్దశంకరంపేట: పెండింగ్‌ కేసులను త్వరగా పూర్తి చేయాలని ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సిబ్బందిని ఆదేశించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందేలా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రత చర్యల్లో భాగంగా ప్రతిరోజూ వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు. గ్రామాల్లో పోలీసింగ్‌ను మరింత బలోపేతం చేయాలని సూచించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమన్నారు. కార్యక్రమంలో మెదక్‌ డీఎస్పీ ప్రసన్నకుమార్‌, సీఐలు రాజశేఖర్‌రెడ్డి, రేణుకారెడ్డి, సందీప్‌రెడ్డి, ఎస్‌ఐ పోచయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం 161వ జాతీయ రహదారి కోళాపల్లి పాత టోల్‌ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన చెక్‌ పోస్టును తనిఖీ చేశారు. పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు జిల్లావ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement