వారసత్వ సంపదనుకాపాడుకోవాలి | - | Sakshi
Sakshi News home page

వారసత్వ సంపదనుకాపాడుకోవాలి

May 23 2026 9:29 AM | Updated on May 23 2026 9:29 AM

కౌడిపల్లి(నర్సాపూర్‌): వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ అన్నారు. వారసత్వ సంపద పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండలంలోని వెల్మకన్నలో పర్యటించారు. పాపన్నపేట సంస్థానంలోని రాణి శంకరమ్మ ఇనాం గ్రామం వెల్మకన్న అన్నారు. గ్రామంలో నాలుగు దిక్కుల నాలుగు సింహ ద్వారాలు, గ్రామం చుట్టూ కోటగోడ, బురుజులు ఉండేవన్నారు. ప్రస్తుతం కోటగోడ, బురుజులు ధ్వంసం అయ్యాయని చెప్పారు. వార సత్వ సంపదను రక్షించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్‌రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రజలకు మెరుగైన వైద్యం

కౌడిపల్లి(నర్సాపూర్‌): సీహెచ్‌సీ నూతన భవనం ప్రారంభం అయితే ప్రజలకు మరింత మెరుగైన వైద్యం అందుతుందని ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో రూ. 9.67 కోట్లతో నిర్మించిన సీహెచ్‌సీ భవనాన్ని పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం మెరుగైన వైద్యం అందించేందుకు సీహెచ్‌సీ మంజూరు చేసి రూ.9.67 కోట్లు కేటాయించిందన్నారు. ప్రస్తు తం నిర్మాణం పూర్తి కాగా, వైద్య పరికరాలు రావాల్సి ఉందన్నారు. డయాలసిస్‌ కేంద్రం సైతం మంజూరైందని తెలిపారు. కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్‌ శివదయాల్‌, సీహెచ్‌సీ సూపరింటెండెంట్‌ వెంకటలక్ష్మి, మండల వైద్యాధికారి శ్రీకాంత్‌, ఈఈ రవీందర్‌, ఏఈ మహేశ్‌, బీఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు రామాగౌడ్‌, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

చివరి గింజ వరకు కొంటాం

నర్సాపూర్‌ రూరల్‌: రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని డీసీసీ అధ్యక్షుడు అంజనేయులుగౌడ్‌ అన్నారు. శుక్రవారం మండలంలోని రెడ్డిపల్లితో పాటు తదితర కొనుగోలు కేంద్రాలు, రైస్‌ మిల్లులను ఆర్డీఓ రామకృష్ణ, తహసీల్దార్‌ శ్రీనివాస్‌తో కలిసి సందర్శించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగుతుందన్నారు. ఆవంచ, రెడ్డిపల్లి వద్ద ఉన్న గోదాంలను వినియోగంలోకి తీసుకువచ్చి ధాన్యం నిల్వ ఉంచేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ప్రతిపక్ష నాయకులు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు. రైస్‌ మిల్లర్లు వెంటనే ధాన్యం అన్‌లోడ్‌ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు యాదగిరిగౌడ్‌, పద్మావతి, నాయకులు పాల్గొన్నారు.

చట్టాన్ని చేతుల్లోకి

తీసుకుంటారా..?

రామాయంపేట(మెదక్‌): మున్సిపల్‌ నిధులు దుర్వినియోగం అయ్యాయని ఆరోపిస్తూ అధికార పార్టీకి చెందిన మున్సిపల్‌ చైర్‌పర్సన్‌, కొందరు కౌన్సిలర్లు అకౌంటెంట్‌ గదికి తాళం వేయడం చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడమేనని బీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు ఆరోపించారు. శుక్ర వారం కౌన్సిలర్లు చరిత, ప్రవీణ్‌, మాధవి కా ర్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. నిధులు దుర్వినియోగం అయితే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయాలి తప్ప, ఇలా ప్రవర్తించవద్దన్నారు. వారి వైఖరితో మున్సిపాలిటీకి చెడ్డపేరు వచ్చిందన్నారు. పది రోజుల క్రితం గదికి తాళం వేసి ఇప్పటివరకు తీయకపోవడం సరికాదన్నారు. తాళం వేసే అధికారం వారికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. అభివృద్ధి గురించి పట్టించుకోకుండా ఇలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమన్నారు. పట్టణంలో చాలా సమస్యలు పేరుకుపోయాయని, ముందుగా వాటిని పరిష్కరించాలని హితవు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement