కంది(సంగారెడ్డి): అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కందిలో శుక్రవారం నిర్వహించిన జిల్లా స్థాయి ‘ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక’సమావేశంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించడం కోసం గ్రామ,మండల, జిల్లా స్థాయిలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. సమాజంలో ఉన్న 50% మహిళలకు భద్రత ఆర్థికాభివృద్ధి కోసం పలు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. రూ.850 కోట్లను బ్యాంకు లింకేజీతో రుణాలను స్వయం సహాయక సంఘాలకు అందజేసినట్లు చెప్పారు. మహిళాశక్తిని పెంచేందుకు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు కేటాయించామని గుర్తు చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో సంఘాలకు పావలా వడ్డీపై రుణాలు అందజేశామని అదే స్ఫూర్తితో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయాలని లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని వెల్లడించారు. పేదలందరికీ వైద్యం అందాలనే ఉద్దేశంతో గతంలో ఉన్న రూ.ఐదు లక్షల పరిధిని రూ.పది లక్షలకు ఆరోగ్యశ్రీలో పెంచామని వివరించారు. దీంతోపాటు మరో 163 చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చినట్లు పేర్కొన్నారు.
మంత్రి దామోదర రాజనర్సింహ


