మెదక్‌జోన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిస్తూ పాఠశాలల ప్రారంభం రోజునే విద్యార్థులకు యూనిఫాంలు, బుక్స్ అందించాలని టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి డిమాండ్ చేశారు. బుధవారం ఆయన యూనియన్ నేతలతో కలిసి మాట్లాడారు. అ నేక పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని గుర్తు చేశారు. జనాభా గణన నేపథ్యంలో బడిబాట, విద్యార్థుల నమోదు కార్యక్రమాన్ని జూన్ 2 నుంచి మొదలు పెట్టాలన్నారు. పీఆర్సీ ప్రకటించి, ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు అందించాలన్నారు. అలాగే రామాయంపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల హెచ్‌ఎం నాగమణి తోటి ఉపాధ్యాయులను మనోవేదనకు గురిచేస్తున్నారని, చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కౌన్సిలర్ సభ్యుడు సంగయ్య, హీరాలాల్, నజీరొద్దీన్, రమేశ్, శ్రీనివాస్‌రెడ్డి, సురేందర్, దేవిసింగ్ తదితరులు పాల్గొన్నారు.
నేలకు జీలుగ జీవం
కౌడిపల్లి(నర్సాపూర్): నేలకు జీలుగ జీవన ఎరువు అని ఏడీఏ పుణ్యవతి తెలిపారు. బుధవారం కౌడిపల్లి రైతు వేదికలో రైతులకు జీలుగ విత్తనాలను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పచ్చిరొట్ట ఎరువులైన జీలుగు, జనుముతో భూసారం పెరుగుతుందన్నారు. జీలుగు విత్తనాలు సాగు చేసి 45 రోజుల తర్వాత నేలలో కలియ దున్నడం వల్ల భూసారం పెరిగి పంటలకు కావాల్సిన పోషకాలు అందుతాయని చెప్పారు. రైతులు జీలుగు విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఓ స్వప్న, ఏఈఓలు, రైతులు పాల్గొన్నారు.
కళలకు మరింత గుర్తింపు
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో కళలకు మరింత గుర్తింపు తీసుకురావాలని అదనపు కలెక్టర్ నగేశ్ అన్నారు. ‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’లో భాగంగా బుధవారం కలెక్టరేట్‌లో యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కళలకు నెలవన్నారు. వివిధ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరన్నారు. భవిష్యత్‌లో కళలకు మరింత గుర్తింపు తేవాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా విద్యార్థులు నిర్వహించిన జానపద నృత్యాలు అందరిని అలరించాయి. ఇందులో ప్రతిభ చూపించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందించారు.
జనగణనకు సహకరించాలి
తూప్రాన్: ప్రభుత్వం చేపడుతున్న జనగణనకు ప్రజలు సహకరించాలని ఆర్డీఓ జయచంద్రారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నాగులపల్లిలో జరుగుతున్న జనగణన ప్రక్రియను పర్యవేక్షించారు. ఈసందర్భంగా ఆయ న మాట్లాడుతూ.. ఇప్పటివరకు డివిజన్‌లో మొత్తం 52,689 ఇళ్లకు గాను 19,064 ఇళ్ల ఎన్యూమరేషన్ పూర్తయిందన్నారు. జూన్ 9 నాటికి జనగణన ప్రక్రియను పూర్తిస్థాయిలో ముగించే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారని తెలిపారు. కాగా కొంతమంది ప్రజలు వాహనాల వివరాలు ఇస్తే రేషన్ కార్డులు తొలగిస్తారనే అపొహతో సమాచారం ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నారని చెప్పారు. అలాంటి భయం అవసరం లేదన్నారు. ఈసమాచారం కేవలం ప్రభుత్వ గణాంకాల కోసం మాత్రమే సేకరిస్తున్నట్లు స్పష్టం చేశారు.


