చేయూతలో అక్రమాలకు చెక్‌ | - | Sakshi
Sakshi News home page

చేయూతలో అక్రమాలకు చెక్‌

May 21 2026 10:07 AM | Updated on May 21 2026 10:07 AM

మెదక్‌జోన్‌: ప్రభుత్వం చేయూత పథకంలో వివిధ వర్గాల వారికి పింఛన్లు అందజేస్తోంది. కొందరికి తపాలా కార్యాలయాల ద్వారా, మరికొందరికి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. అయితే ఈ పథకంలో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. లబ్ధిదారులు చనిపోయినా.. వారి బ్యాంకు ఖాతాల్లో జమవుతున్న పింఛన్‌ డబ్బులను కుటుంబ సభ్యులు తీసుకుంటున్నారు. దీనిని అరికట్టి మరణించిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే ఇంటింటి సర్వేకు శ్రీకారం చుట్టింది. అధికారులు లబ్ధిదారుడి ఇంటికి వెళ్లి ముఖ గుర్తింపు (ఫేషియల్‌ రికగ్నిషన్‌) యాప్‌లో నమోదు చేస్తున్నారు.

ప్రతీ నెల రూ. 24.71 కోట్లు పంపిణీ

జిల్లాలో 9 రకాల పింఛన్‌దారులు 1,08,642 మంది ఉండగా, వారిలో 60,740 మందికి నేరుగా బ్యాంకు అకౌంట్‌ల ద్వారా ఖాతాలో జమచేస్తున్నారు. మరో 47,902 పింఛన్‌దారులకు మాత్రం పోస్టాఫీస్‌ ద్వారా పంపిణీ చేస్తున్నారు. ప్రతీ నెల రూ.24.71 కోట్లు పంపిణీ జరుగుతుంది. కాగా పోస్టాఫీస్‌ ద్వారా లబ్ధిదారుల బయోమెట్రిక్‌, ఫేషియల్‌ రికగ్నిషన్‌ సిస్టమ్‌ ద్వారా పంపిణీ చేస్తుండటంతో ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా పంపిణీ జరుగుతుందని అధికారులు గుర్తించారు. అదే బ్యాంకు అకౌంట్‌ ద్వారా పింఛన్లు పొందుతున్న వారిలో చనిపోయిన వారి పేర్లపై సైతం నెలనెల పింఛన్లు జమవుతున్నట్లు అధికారులు గుర్తించారు. కాగా లబ్ధిదారుల సర్వేను గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ కార్యదర్శులు చేస్తుండగా, అర్బన్‌ ప్రాంతాల్లో వార్డు అధికారులు చేస్తున్నారు. ఈనెల 15న ప్రారంభమైన సర్వే జూన్‌ 15 వరకు కొనసాగనుంది.

జిల్లాలో ఇలా..

వికలాంగులు 863

వృద్ధులు 37,800

ఒంటరి మహిళలు 4,596

వితంతువులు 45,838

కల్లుగీత 834

చేనేత 444

బోధకాలు 455

బీడీ కార్మికులు 17,652

డయాలసిస్‌ 160

ముమ్మరంగా సాగుతున్న సర్వే

యాప్‌లో వివరాలు

నమోదు చేస్తున్న అధికారులు

జిల్లావ్యాప్తంగా

1.8 లక్షల పింఛన్‌దారులు

రికవరీ చేస్తాం

మెదక్‌ బల్దియాలోని నాలుగు వార్డులను పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి సర్వే చేయగా 39 మంది చనిపోయిన వారి ఖాతాల్లో చేయూత పింఛన్‌ డబ్బులు పడినట్లు గుర్తించాం. వాటిలో మృతుల కుటుంబీకులు కొందరు ఏటీఎంల ద్వారా డబ్బులు డ్రా చేయగా, మరికొందరు చేయలేదు. డ్రా చేసిన వారి నుంచి డబ్బులు రికవరీ చేస్తాం.

– శ్రీనివాసరెడ్డి, మెదక్‌ మున్సిపల్‌ కమిషనర్‌

Advertisement
 
Advertisement
Advertisement