మిల్లర్ల మాయాజాలం! | - | Sakshi
Sakshi News home page

మిల్లర్ల మాయాజాలం!

May 21 2026 10:07 AM | Updated on May 21 2026 10:07 AM

మెదక్‌ అర్బన్‌: జిల్లాలో యాసంగి సంబంధించి మొత్తం 3.50 లక్షల మెట్రిక్‌ టన్నుల వడ్లు కొనుగోలు కేంద్రాలకు వస్తాయని భావిస్తుండగా, ఇందులో 50 లక్షల టన్నులు సన్నాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు 25 వేల మెట్రిక్‌ టన్నుల సన్న వడ్లు, 1.75 లక్షల దొడ్డు వడ్లు కొనుగోళ్లు జరి గాయి. అయితే ఇందులో సన్నాలకు డిమాండ్‌ ఉండటంతో మిల్లర్లు అనేక ఎత్తులు వేస్తూ కొనుగోళ్లు చేస్తున్నారు. ప్రతి కేంద్రం నుంచి దళారులను రంగంలోకి దించి రూ.100 నుంచి రూ.150 వరకు కమీషన్లు ఇస్తూ కొనుగోళ్లు చేస్తున్నారు.

సర్కార్‌ బోనస్‌ ఇస్తే.. మేము ఇస్తాం

కొనుగోలు కేంద్రాల్లో సన్నాలను దొడ్డు వడ్లుగా నమోదు చేయాలని మిల్లర్లు షరతులు పెడుతున్నారు. అందుకు దళారులకు కమీషన్లు ఇస్తున్నారు. ఒక వేళ సన్నాలకు ప్రభుత్వం బోనస్‌ ఇస్తే, తాము క్వింటాల్‌కు రూ.400 చెల్లిస్తామని హామీలు ఇస్తూ కొనుగోళ్లు చేస్తున్నారు. దళారులకు క్వింటాల్‌కు రూ.100 నుంచి 150 వరకు చెల్లిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, దళారులు, పలుకుబడి గల నాయకులు సన్నాల వ్యాపారం చేస్తున్నారు. ఇందుకోసం మిల్లర్లు తమ సొంత లారీలను పంపుతున్నారు.

సన్నాలే ఎందుకు..?

సన్నాలు మిల్లర్లకు లాభదాయకంగా ఉండటంతో వాటి కొనుగోలు కోసం పోటీ పడుతున్నారు. దీంతో మిల్లర్ల అసోసియేషన్‌ ఒక్కో మిల్లు 70 లారీల కన్న ఎక్కువ వడ్లను తీసుకోవద్దని అంక్షలు పెట్టింది. అంత కన్నా ఎక్కువ తీసుకుంటే క్వింటాల్‌కు రూ.350 జరిమానా కట్టాలని షరతు పెట్టింది. అయినా కొంత మంది మిల్లర్లు తమ కోటా అయిపోయినా, ఇతర మిల్లర్ల పేరు మీద తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ధనూర, రేగోడ్‌, రంగంపేట ప్రాంతాల్లోని మిల్లర్ల పేర్ల మీద శంకరంపేట ప్రాంతంలోని ఓ మిల్లర్‌ సన్న వడ్లను డంప్‌ చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. ముఖ్యంగా సన్న బియ్యం అయితే స్థానికంగా సివిల్‌ సప్‌లై అధికారులు పాస్‌ చేస్తారు. అక్కడ ఎక్కువ అంక్షలు లేకుండా పాస్‌ అయ్యే అవకాశం ఉంది. అదే దొడ్డు బియ్యం అయితే ఎఫ్‌సీఐ అధికారులు పాస్‌ చేయాల్సి ఉంటుంది. అక్కడ ఆంక్షలు ఎక్కువ అని తెలిసింది. ఒక వేళ రిజక్ట్‌ చేస్తే మిల్లర్‌కు సుమారు రూ.15 వేల వరకు ఖర్చు వృథా అవుతుందని తెలిసింది. దీంతో మిల్లర్లు సన్న బియ్యానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. అవసరమైతే సన్న బియ్యం బయట కూడా రూ. 5,500 నుంచి రూ.6 వేలకు క్వింటాలు అమ్ముడవుతాయి. దీంతో సన్న వడ్లకు డిమాండ్‌ విపరీతంగా పెరిగినట్లు తెలుస్తుంది.

‘సన్నాలను దొడ్డు వడ్లుగా నమోదు చేస్తే క్వింటాల్‌కు రూ.100 కమీషన్‌ ఇస్తాం. ఒక వేళ ప్రభుత్వం బోనస్‌ ఇస్తే, అప్పటికి రూ.400 చెల్లిస్తాం అని పాపన్నపేట మండలంలోని ఒక గ్రామం నుంచి ఓ మిల్లర్‌ 3 లారీల ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా సమీప మండలానికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.’

కొనుగోలు కేంద్రాల్లో

సన్నాలు దొడ్డు వడ్లుగా నమోదు

దళారులకు కమీషన్లు

చేష్టలుడిగి చూస్తున్న అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement