‘ఆ అధికారులను సస్పెండ్‌ చేయాలి’ | - | Sakshi
Sakshi News home page

‘ఆ అధికారులను సస్పెండ్‌ చేయాలి’

Mar 16 2026 8:54 AM | Updated on Mar 16 2026 8:54 AM

‘ఆ అధికారులను సస్పెండ్‌ చేయాలి’ సఫాయి కార్మికులు యాప్రాన్‌ ధరించాలి ఈత సరదా దుఃఖాన్ని మిగల్చకూడదు నేటి నుంచి ఒంటిపూట బడులు

మెదక్‌జోన్‌: జిల్లా కేంద్ర ఆస్పత్రి మెడికల్‌ బోర్డులో లంచాలు ఇచ్చిన వారి ఫైళ్లను మాత్రమే పరిష్కరిస్తున్న సదరు ఉద్యోగితో పాటు, అతడికి సహకరించిన వారందరిని వెంటనే సస్పెండ్‌ చేయాలని తపస్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు చల్లా లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగ, ఉపాధ్యాయుల మెడికల్‌ బిల్లులు చాలా తక్కువ మొత్తంలో మంజూరు చేయడం, విడుదల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వంటి అంశాలపై మెడికల్‌ బోర్డు ఏడీ విజయ్‌భాస్కర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. ప్రస్తుతం మెడికల్‌ బోర్డుపై ఏసీబీ దాడులు చేసిందని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో తపస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జాల సిద్దు, కోశాధికారి మంగ నర్సింలు, సంతోష్‌, ప్రవీణ్‌, చేగుంట మండల అధ్యక్షులుడు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

మెదక్‌ కలెక్టరేట్‌: పారిశుద్ధ్య కార్మికులు యాప్రాన్‌, గ్లౌజ్‌లు ధరించాలని, వారు ఆరోగ్యంగా ఉంటేనే పట్టణం పరిశుభ్రంగా ఉంటుందని మున్సిపల్‌ చైర్మన్‌ కానుగు రాధిక, వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌ పేర్కొన్నారు. ప్రజాపాలనా–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదివారం పారిశుద్ధ్య కార్మికులకు యాప్రాన్‌, గ్లౌజ్‌లు, మాస్క్‌లు పంపిణీ చేశారు. అనంతరం వైస్‌ చైర్మన్‌ నరేశ్‌గౌడ్‌ పారిశుద్ధ్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. రేడియంతో కూడిన యాప్రాన్‌లు ధరించడం వల్ల ప్రమాదాలు జరుగకుండా ఉంటాయని తెలిపారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలన్నారు. కార్యక్రమంలో శానిటేషన్‌ అధికారులు, జవాన్లు, శానిటేషన్‌ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు

మెదక్‌ కలెక్టరేట్‌: పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు విషాదంగా మారకూడదని జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఒంటిపూట బడులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో తల్లిదండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రుల పర్యవేక్షణలోనే పిల్లలకు ఈత నేర్పించాలని స్పష్టం చేశారు. జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ...ఏదైనా ప్రమాదం జరగకముందే జాగ్రత్తలు తీసుకోవడం అత్యంత ముఖ్యమన్నారు. గ్రామాల్లోని బావులు, చెరువుల వద్ద భద్రతా నియమాలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. వీలైనంత వరకు పిల్లలను ఇంట్లోనే ఉంచుకుని చదువు లేదా ఇతర మంచి విషయాలు నేర్పించాలని ఆయన సూచించారు.

న్యాల్‌కల్‌ (జహీరాబాద్‌): ఎండల తీవ్రత అధికమవుతుండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికశాతం పాఠశాలల్లో ఫ్యాన్లు పాడైపోవడంతో ఉక్కపోతకు విద్యార్థులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. దీంతో ప్రభుత్వం ఒంటిపూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. సోమవారం నుంచి ఏప్రిల్‌ 23వ తేదీ వరకు ఒంటిపూట బడులు నిర్వహించాలని రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ ఈనెల 12న ఉత్తర్వులు జారీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని అనంతరం మధ్యాహ్నం భోజనం పెట్టి వదిలి పెట్టాలని సూచించింది. ప్రస్తుతం పదవ తరగతి పరీక్షలు కొనసాగుతున్న పాఠశాలల్లో మాత్రం మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాఠశాలలు పని చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో విద్యార్థులకు ఎండల నుంచి కొంత మేర ఉపశమనం లభించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement