● తొలిసారి డిజిటల్ పద్ధతిలో లెక్కింపు
● అదనపు కలెక్టర్ నగేశ్
మెదక్ కలెక్టరేట్: జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకమని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రూపొందించడానికి దోహదపడతాయని అదనపు కలెక్టర్ నగేశ్ పేర్కొన్నారు. మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో ఆదివారం జిల్లాలో జనగణన–2027 సమర్థవంతంగా నిర్వహించేందుకు జిల్లా, మండలస్థాయి అధికారులకు 3 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాల ప్రణాళికల తయారీకి జనగణన ఎంతో ఉపయోగపడుతుందన్నారు. జిల్లాస్థాయిలో జనగణనను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విధానాలు, మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. దేశంలో తొలిసారిగా డిజిటల్ విధానంలో జనగణన నిర్వహించనున్నట్లు తెలిపారు. మొబైల్ యాప్‌లు, వెబ్ పోర్టల్‌ను ఉపయోగించి గణన ప్రక్రియను నిర్వహించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రజలు తమ వివరాలను తామే స్వయంగా ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకునేందుకు ప్రత్యేక పోర్టల్‌ను గణన ప్రారంభానికి సుమారు 15 రోజుల ముందు అందుబాటులో ఉంచనున్నట్లు స్పష్టం చేశారు. మే 11న నుంచి జూన్ 9వ తేదీ వరకు గృహాల గణన, రెండో దశలో జనగణన 2027 ఫిబ్రవరిలో జరుగుతుందని వివరించారు. మార్చి 1, 2027ను రిఫరెన్స్ తేదీగా పరిగణించడం జరుగుతుందన్నారు. మండలంలో తహశీల్దార్, మున్సిపాలిటీలో కమిషనర్ ఇంచార్జ్‌లుగా వ్యవహరిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్డీఓలు రమాదేవి, జయచంద్రారెడ్డి, రామకృష్ణ, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, డీఎఫ్‌ఓ జోజీ, వివిధ శాఖల అధికారులు, తహశీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు.


