
విద్య, వైద్యం, అవినీతి రహితం
ఇదే నవ భారతానికి నాంది● ప్రజాప్రతినిధులుగావిద్యావంతులే రావాలి ● ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయాలి ● ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చాలి ● సాంకేతికతను అందిపుచ్చుకోవాలి ● సాక్షి టాక్‌షోలో విద్యార్థులు
మెదక్‌జోన్/నర్సాపూర్: బానిస సంకెళ్లు తెంచుకొని పరాయి పాలన నుంచి విముక్తి పొందిన మన దేశం.. 78 ఏళ్లలో ఎంతో పురోగతి సాధించింది. ఈ నేపథ్యంలో స్వాతంత్య్రం కోసం పోరాడిన వారి ఆశలు, ఆశయాలకు అనుగుణంగా అభివృద్ధి చెందిందా? పరిపాలన ఎలా సాగుతోంది? ఇంకా ఎలా ఉండాలి? టెక్నాలజీ, ఎడ్యుకేషన్, హెల్త్, నిరుద్యోగం వంటి అంశాలపై గురువారం మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలతో పాటు నర్సాపూర్ మండలంలోని పెద్దచింతకుంట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గురువారం సాక్షి టాక్‌షో నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు 2047 నాటికి భారతదేశం ఎలా ఉండాలనే విషయాలను పంచుకున్నారు.
విద్యావంతులు రావాలి
రాజకీయాల్లోకి విద్యావంతులు రావాలి. చట్ట సభల్లోకి వెళ్లాలంటే కనీసం డిగ్రీ అర్హత ఉండాలి. సర్పంచ్, ఎంపీటీసీ పదవులకు పది, ఇంటర్ నిబంధన పెట్టాలి.
– శ్రీనివాస్, బీకాం
వైద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి
కార్పొరేట్ ఆస్పత్రులను తలదన్నే విధంగా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలి. అన్నిరకాల జబ్బులకు ఉచిత వైద్యం అందించాలి. ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ ఆస్పత్రులు నడపకూడదనే నిబంధన తీసుకురావాలి.
– రవితేజ, బీకాం
ఉపాధి మార్గాలు చూపించాలి
దేశంలోని బడీడు పిల్లలందరూ చదువుకోవాలి. అందుకు అయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరి ంచి నాణ్యమైన విద్యను అందించాలి. ఉన్నత చదువులు చదువుకున్న ప్రతీ విద్యార్థికి ఉపాధి మార్గాలు చూపాలి.
– శ్రీజ బీకాం
ప్రభుత్వ విద్య బలోపేతం చేయాలి
ప్రాథమిక స్థాయి నుంచి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి. ప్రైవేట్ విద్యారంగాన్ని అదుపు చేయాలి. అవినీతిని అరికట్టి పారదర్శకతతో కూడిన పరిపాలనరావాలి. – కల్యాణ్, బీజెడ్‌సీఎస్
పరిపాలన నిజాయితీగా ఉండాలి
పరిపాలన నిజాయితీగా ఉన్నప్పుడే దేశం అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తుంది. రాజకీయ నాయకుల భాగస్వామ్యంలో ప్రైవేట్ విద్యారంగం ఉన్నంత కాలం ప్రభుత్వ విద్యా విధానం అభివృద్ధి చెందదు.
– లక్ష్మణ్‌గౌడ్, బీఏ
ఒకే విద్యా విధానం అవసరం
దేశమంతా ఒకే విద్యా విధానం అమలు చేయా లి. సాంకేతిక పరిజ్ఞానం మరింత అభివృద్ధి చెందే విధంగా ప్రభుత్వం ప్రోత్సహించాలి. అన్ని రంగాల్లో డిజిటలైజేషన్ అమలు చేస్తూ, పరిపాలన మరింత మెరుగుపర్చాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి.
– ఒమన్ ఫైజల్, బీజెడ్‌సీఎస్
పరిశోధనలను ప్రోత్సహించండి
పరిశోధనలకు నిధులు పెంచాలి. ప్రధా నంగా వైద్య రంగంలో మెడిసిన్ తయారీని ప్రోత్సహించాలి. విద్యా విధానంలో అవసరమైన మార్పులు చేయాలి.
– ఐశ్వర్య, బీజెడ్‌సీఎస్
సాగులో సాంకేతికత అవసరం
సాగులో సాంకేతికత పెరగాలి. పరిశ్రమలతో పాటు వ్యవసాయ రంగానికి చేరువకావాలి. పరిపాలన విధానంలో మార్పు లు రావాలి. అధికారులు, ప్రజాప్రతినిధులు బాధ్యతగా పనిచేసి అందరికీ సమాన స్థాయిలో సేవలు అందించాలి.
– స్నేహ, ఎంసీసీఎస్
చట్టాలు కఠినతరం చేయాలి
డ్రగ్స్, మాదక ద్రవ్యాల విక్రయాలను అరికట్టి చట్టాలను కఠినంగా అమలుచేయాలి. మంచి సమాజ ఏర్పాటుకు కృషి చేయాలి. సాంకేతిక విద్యను పేదలకు చేరువ చేయాలి. అన్ని రంగాల్లో అవినీతిని అరికట్టాలి.
– అనూష, ఎంపీసీఎస్
కంపెనీల కాలుష్యం పెరిగింది
కంపెనీల నుంచి వచ్చే కాలుష్యాన్ని అదుపు చేయాలి. ఆహార పదార్థాల్లో కల్తీపై కఠినంగా వ్యవహరించాలి. గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్యం ఉచితంగా అందజేయాలి. సాంకేతికతను గ్రామాలకు చేరువ చేయాలి.
– రమేశ్, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ