
పొంగే వాగులు, వంకలు దాటొద్దు
కలెక్టర్ రాహుల్‌రాజ్,ఎస్పీ శ్రీనివాసరావు
వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన
మెదక్ కలెక్టరేట్: ప్రజలు పొంగే వాగులు, వంతెనలు దాటే ప్రయత్నం చేయవద్దని కలెక్టర్ రాహుల్‌రాజ్, ఎస్పీ శ్రీనివాసరావు సూచించారు. గురువారం హవేళిఘణాపూర్ మండలం ధూప్‌సింగ్ తండాలో లోలెవెల్ కాజ్‌వే, పోచారం డ్యాంను పరిశీలించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రకృతి విపత్తులలో ప్రజల రక్షణకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నామని, కాజ్‌వే, కల్వర్టుల వద్ద పటిష్ట పోలీసు భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. జిల్లాలో వరదలకు సంబంధించి ఎలాంటి సమస్య వచ్చిన ఎదుర్కొనేందుకు 10 మంది సభ్యులతో ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అనంతరం పోచారం డ్యాం నీటిమట్టం వివరాలను తెలుసుకున్నారు. అనంతరం హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్‌రెడ్డి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్, ఎస్పీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు.