
ఖాకీ కవచాలు
విపత్తుల వేళ రక్షణ కల్పించేందుకు కృషి
ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం
మెదక్ మున్సిపాలిటీ: విపత్తుల వేళ పోలీస్‌శాఖ ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపింది. ఇందులో భాగంగా డిచ్‌పల్లి 7వ బెటాలియన్‌కు చెందిన 25 మంది ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందం గురువారం ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. వీరు కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో పనిచేస్తారు. కఠోర శిక్షణ తీసుకొని, ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రంగంలోకి దిగుతారు. ప్రజలు ప్రమాదంలో చిక్కుకున్నారంటే.. స్థానిక పోలీస్‌స్టేషన్, డయల్ 100కు కాల్ చేసి సమాచారం అందిస్తే చాలు, వెంటనే అక్కడికి చేరుకుంటారు. సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక పరికరాల సహాయంతో ప్రమాదంలో ఉన్నవారి ప్రాణా లు కాపాడేందుకు కృషి చేస్తారు. ఎక్కడైనా రాకపోకలు నిలిచినా.. వరదల్లో చిక్కుకున్నా.. కాలనీల్లోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బంది పడుతు న్నా.. వారిని కాపాడుతారు. ఇదే విషయమై ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జిల్లాలో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు సమాచారం ఉందని, ఎలాంటి ఆపద వచ్చిన ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందంతో పాటు జిల్లా కేంద్రంలో 4 క్యూఆర్‌టీ (క్విక్ రెస్పాన్స్ టీం) అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. అలాగే అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు లైవ్ జాకెట్లు, ఇతర అన్నిరకాల సామగ్రి ఉందన్నారు. విపత్తుల వేళ ప్రజల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రెస్క్యూ టీంను ఏర్పాటు చేశామన్నారు.
25 మందితో ప్రత్యేక రెస్క్యూ టీం