
సొసైటీలు.. మరో ఆరు నెలలు
పీఏసీఎస్ పాలకవర్గాల పదవీకాలం పొడిగింపు
రామాయంపేట(మెదక్): సహకార సంఘాల పదవీ కాలం పొడిగిస్తూ గురువారం ప్రభుత్వం ఉత్తర్వు లు జారీ చేసింది. 2020లో సహకార సంఘాలకు గత ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించింది. ఐదేళ్లు పూర్తి కావడంతో వాటి గడువు గత ఫిబ్రవరిలోనే ముగిసింది. కాంగ్రెస్ ప్రభుత్వం వీటి గడువును మరో ఆరు నెలల పాటు పొడిగించగా, ఆ గడువు సైతం నేటితో ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడం, ప్రస్తుత పరిస్థితుల్లో సహకార సంఘాల ఎన్నికల నిర్వహణ కష్టసాధ్యమవుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం మళ్లీ ఆరు నెలల పాటు పొడిగించినట్లు తెలిసింది.
ఆ సంఘాల పొడిగింపు లేనట్లే..
కేసులు కొనసాగుతున్న, నష్టాలబాట పట్టిన సంఘాల పొడిగింపు అనుమానస్పదమే. ఈమేరకు సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని సమాచారం. జిల్లాలో 37 సహకార సంఘాలుండగా, రాంపూర్ సంఘం పాలకవర్గాన్ని గతంలోనే రద్దు చేయగా, ప్రత్యేక అధికారి పర్యవేక్షణలో కొనసాగుతుంది. మిగితా 36 సంఘాల్లో కనీసం 16కుపైగా సంఘాలు నష్టాల బాటలో ఉన్నాయి. మరికొన్ని సంఘాలకు సంబంధించి నిధుల దుర్వినియోగం, తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. పొడిగింపు లేని సంఘాలకు త్వరలో ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు తెలిసింది.
వాటి వివరాలు త్వరలో ప్రకటిస్తాం
జిల్లాలోని 36 సంఘాలకు గానూ పొడిగించే అవకాశం లేని సొసైటీల వివరాలు త్వరలో ప్రకటిస్తాం. మిగితా సంఘాల పదవీకాలం పొడిగించారు. నాలుగైదు రోజుల్లో వారికి ఉత్తర్వులు అందే అవకాశం ఉంది.
– కరుణాకర్, జిల్లా సహకార అధికారి