
ప్రమాదాలకు చెక్ పెట్టాలి
● పరిశ్రమల్లో తనిఖీలు చేసినివేదికలు సమర్పించండి ● అధికారులకు కలెక్టర్ ఆదేశం
మెదక్ కలెక్టరేట్: జిల్లాలోని రసాయన, ఔషధ పరిశ్రమలలో ప్రమాదాలు సంభవించకుండా తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మెదక్ సమీకృత కలెక్టరేట్‌లో ఫ్యాక్టరీలు, రసాయన పరిశ్రమల్లో భద్రతపై ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు భద్రతపై దృష్టి సారిస్తూ కర్మాగారాలలో పనిచేసే కార్మికుల పూర్తి సమాచారం యాజమాన్యం దగ్గర ఉండాలని సూ చించారు. కార్మికులు మత్తు పదార్థాలు వాడుతున్న ట్లు తమ దృష్టికి వస్తే యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పరిశ్రమల్లో అంతర్నిర్మిత భద్రతా వ్యవస్థలను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి కమిటీ ఆయా రసాయనిక పరిశ్రమలు, ఔషధ యూనిట్లను తనిఖీ చేసి నివేదిక సమర్పించాలని చెప్పారు. అదనపు కలెక్టర్ నగేష్ , ఆర్డీవోలు రమాదేవి, మహిపాల్ రెడ్డి, జయచంద్రారెడ్డి, జడ్పీ సీఈవో ఎల్లయ్య, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ మోహన్ బాబు, డైరెక్టర్ ఆఫ్ బాయిలర్స్ శ్రీనివాస రావు, కర్మాగారాల జిల్లా ఉప ప్రధాన అధికారి లక్ష్మి కుమారి, జిల్లా పరిశ్రమల మేనేజర్ ప్రకాష్ రావు, జిల్లా అగ్నియాపక శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, కార్మిక, తదితర శాఖధికారులు పాల్గొన్నారు.
సౌర ప్లాంట్లపై మూడు రోజుల్లో నివేదిక
జిల్లాలో సౌర విద్యుత్ ఏర్పాటు కోసం మూడు రోజుల్లో నివేదికలు అందజేయాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ నగేష్, జెడ్పీ సీఈఓ ఎల్లయ్య, ఆర్డీవోలు రమాదేవి, జయచంద్రారెడ్డి, మహిపాల్ రెడ్డి, రెడ్‌కో డీఎం రవీందర్ చౌహన్‌లతో తదితరులతో కలసి సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, వసతి గృహాలు, అన్ని యాజమాన్యాల గురుకులాలలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ మేరకు ప్లాంట్ ఏర్పాటుకు కావాల్సిన వైశాల్యం, నెలకు విద్యుత్ వినియోగం వంటి వివరాలను నిర్ణీత నమూనాలో పూర్తిచేసి మూడు రోజుల్లోగా నివేదికలు అందించాలని ఆదేశించారు. కాగా, జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
పౌష్టికాహారం అందించాలి
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండల పరిషత్ కార్యాలయం, పశువైద్యశాల, కల్వకుంట గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రం, ఆరోగ్య ఉప కేంద్రం, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను కలెక్టర్ రాహుల్‌రాజ్ పరిశీలించారు. వర్షాకాలంలో వ్యాధులు విస్తరించే ప్రమాదం ఎక్కువగా ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నపిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. కల్వకుంటలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థుల ప్రతిభను కొనియాడారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నిజాంపేట మండలం ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఇళ్లు త్వరితగతిన నిర్మించుకుంటే ప్రభుత్వం వెంటనే బిల్లులు జమ చేయనున్నట్లు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతపై దృష్టి సారించాలన్నారు. ఎంపీడీవో రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఉద్యోగులకు సెలవులు రద్దు: కలెక్టర్
అప్రమత్తంగా ఉండండి
మెదక్ కలెక్టరేట్: జిల్లాలో రానున్న 72 గంటల్లో భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ రాహుల్‌రాజ్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి జిల్లాలోని ఆయా శాఖల అధికారులతో వర్షాల నేపథ్యంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వర్షాల నేపథ్యంలో అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే స్పందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ 24/7 పనిచేస్తుందని తెలిపారు. వరదలు, ఇళ్లకు నష్టం, రహదారులు ధ్వంసం, చెట్లు కూలిపోవడం వంటి విపత్కర పరిస్థితులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూమ్‌కు 9391942254 సమాచారం అందించాలని కలెక్టర్ కోరారు. ఈ నేపద్యంలో 13, 14, 15 మూడు రోజులు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు, సిబ్బందికి సెలవులు రద్దు చేస్తున్నట్లు చెప్పారు. అందరూ అందుబాటులో ఉండాలన్నారు. కాగా జిల్లాలో 11 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించినట్లు తెలిపారు. పశుసంవర్ధక శాఖ పరిధిలో పురాతన కోళ్ల ఫారాలు, గోడలు కూలిపోయే ప్రమాదం ఉందని, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తాగునీటి , విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని చెప్పారు.