
బ్లడ్ బ్యాంకులో.. నిల్వలు నిల్!
మెదక్ మున్సిపాలిటీ: బ్లడ్ బ్యాంకులో నిల్వలు నిండుకున్నాయి. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు అత్యవసర సమయాల్లో రక్త యూనిట్ అందక అనేక అవస్థలు పడాల్సి వస్తోంది. జిల్లాలో రక్తమార్పిడికి అవసరమయ్యే రోగుల సంఖ్య పెరిగింది. కానీ ఆస్థాయిలో రక్త నిల్వలు పెరగడం లేదు. దీంతో వైద్యసేవలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
తగ్గిపోయిన నిల్వలు
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు, శస్త్ర చికిత్స సమయంలో రోగులకు రక్తం యూని ట్లు అవసరం ఉంటుంది. ఇందుకోసం జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో బ్లడ్ బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం జిల్లాలో రక్తం నిల్వలు అంతంత మాత్రంగానే అందుబాటులో ఉన్నాయి. దాత లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు పిలుపునిస్తున్నారు. కార్యాలయాలు, గ్రామాల్లో ఎప్పటికప్పుడు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నప్పటికీ, జిల్లాలో అవసరాలకు రక్త నిల్వలు సరిపోవడం లేదు. ప్రస్తుతం బ్లడ్ బ్యాంక్‌లో కొన్ని రకాల బ్లడ్ యూనిట్లు పూర్తిగా ఖాళీ అయినట్లు తెలుస్తోంది.
కారణాలు ఇవే..
సాధారణంగా ఏ బాధితుడికి రక్తం ఇచ్చినా, ప్రత్యామ్నాయంగా అతడి సంబంధీకుల నుంచి రక్తం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రక్త నిల్వలు తగ్గిపోకుండా ఉంటాయి. రక్తం అవసరమైన బాధితుల బంధువులు, స్నేహితులకు అవగాహన కల్పించపోవడమే నిల్వలు తగ్గిపోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. మరోవైపు రక్తదాతలను ప్రోత్సహించక పోవడం, రక్తం రిప్లేస్‌మెంట్ చేయక పోవడం వల్ల జిల్లా కేంద్ర ఆస్పత్రిలో ఈ పరిస్థితి నెలకొన్నట్లు సమాచారం.
ప్రైవేట్‌లో ఇలా..
ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందే బాధితులకు రక్తం అవసరమైనప్పుడు ప్రభుత్వ నిల్వ కేంద్రంలోనూ లభించడం లేదు. దీంతో ప్రైవేట్ బ్లడ్ బ్యాంకుల్లో ఒక యూనిట్ బ్లడ్‌కు రూ.1,200 నుంచి 1,400 వరకు వసూలు చేస్తున్నారు. అయితే రక్తం యూనిట్‌కు డబ్బులు చెల్లించలేని నిరుపేదల నుంచి అదేస్థాయిలో యూనిట్ రక్తం తీసుకుంటున్నట్లు సమాచారం.
కొన్ని గ్రూపులు పూర్తిగా ఖాళీ
మరికొన్ని అంతంత మాత్రమే..
పట్టించుకోని వైద్యాధికారులు
అత్యవసర సమయంలోరక్తం అందక అవస్థలు
దాతలు ముందుకు రావాలి
రేర్ గ్రూపు రక్త యూనిట్లు అందుబాటులో ఉండటం కష్టం. వాటిని అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నాం. ఒక రక్తం యూనిట్ కేవలం నెలరోజులు మాత్రమే ఉంటుంది. జిల్లాలోని రక్తదాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయాలి. స్వచ్చంద సంస్థలు, మానవతామూర్తులు స్పందించాలి. రక్తదానం చేయాలనుకుంటే 8977173917 నంబర్‌లో సంప్రదించాలి.
– అశోక్, టెక్నీషియన్, బ్లడ్ బ్యాంక్, మెదక్