
రైతు బీమా.. ధీమా
రేపటితో ముగియనున్న గడువు
మెదక్‌జోన్: రైతుబీమా దరఖాస్తు గడు వు రేపటితో ముగియనుంది. ఇప్పటికే అర్హులైన పాత వారితో పాటు కొత్తగా దరఖాస్తు చేసుకునే రైతులందరికీ ఈనెల 14న ఎల్‌ఐసీ (బీమా) బాండ్లు రానున్నాయి. అలాగే నామినీ పేరు సవరణ చేసుకునేందుకు మంగళవారంతో గడువు ముగియనుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. జిల్లావ్యాప్తంగా 6 లక్షల పైచిలుకు వ్యవసాయ భూములుండగా, సుమారు 2 లక్షల వరకు రైతులు ఉన్నారు. గత ప్రభుత్వం 2018లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతు ఏ కారణం చేత మరణించినా, ఆ కుటుంబానికి ఎల్‌ఐసీ పాలసీ తరఫున సదరు రైతు కుటుంబానికి రూ. 5 లక్షల చొప్పున బీమా సొమ్ము చెల్లిస్తుంది. ప్రతి ఏడాది బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వం సదరు ఎల్‌ఐసీకి చెల్లిస్తోంది. ఈ పథకంలో ఇప్పటివరకు 1,77,084 మంది రైతులు పాతవారు ఉండగా, జూన్ 5 వరకు జిల్లాలో కొత్తగా పట్టాపాస్ పుస్తకాలు పొందిన రైతులు 12,145 మంది ఉన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. కొత్తవారు సకాలంలో బీమాకు దరఖాస్తు చేసుకుంటే ఆ సంఖ్య 1,89,229కు చేరనుంది.
బీమాకు అర్హులు వీరే..
రైతు బీమాకు 18 నుంచి 59 ఏళ్ల మధ్య గల రైతులు మాత్రమే అర్హులు. 1966 ఆగస్టు, 2007 ఆగస్టు మధ్యలో జన్మించిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. కాగా ఇప్పటికే ఈ పథకంలో 59 ఏళ్లు నిండిన రైతులు ఉంటే అధికారులు వారి పేర్లను తొలగిస్తారు. కొత్తగా పాస్ పుస్తకం పొందిన రైతులు ఆయా మండలాల ఏఈఓలు, ఏఓలకు పట్టాదార్ పాస్ పుస్తకం జిరాక్స్ తో పాటు ఆధార్‌కార్డు జిరాక్స్ అందజేస్తే బీమాకు సంబంధించిన ప్రక్రియ పూర్తి చేస్తారు. అలాగే నామినీ ఆధార్‌కార్డుతో పాటు వివరాలు అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది.
అర్హులు దరఖాస్తు చేసుకోవాలి
కొత్తగా పట్టాదార్ పాస్ పుస్తకం పొందిన ప్రతి రైతు ఈనెల 13వ తేదీ వరకు రైతుబీమా కోసం దరఖాస్తు చేసుకోవాలి. నామినీ సవరణ చేసుకునే వారికి మంగళవారం సాయ ంత్రం వరకు అవకాశం ఉంది. ఈ పథకం రైతు కుటుంబాలకు కొండంత అండగా ఉంటుంది.
– దేవ్‌కుమార్,
జిల్లా వ్యవసాయాధికారి
నేటితో ముగియనున్న నామినీ సవరణ
జిల్లాలో 1.77 లక్షల రైతుల ఇన్సూరెన్స్ రెన్యూవల్
కొత్తగా పాస్‌పుస్తకాలు
పొందినవారు 12 వేల పైచిలుకు..

రైతు బీమా.. ధీమా

రైతు బీమా.. ధీమా