బెల్లంపల్లి: సమాజానికి ఉపయోగపడే అంశాలపై విద్యార్థులు దృష్టి సారించాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాల/కళాశాలలో మూడు రోజులపాటు నిర్వహించనున్న బ్రెయిన్ రెయిన్–2026 జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవితంలో ఉన్నత లక్ష్యాలను సాధించాలంటే క్రమశిక్షణ, సమయపాలన ఎంతో అవసరమన్నారు. సంక్షేమ గురుకులాల జోనల్ అధికారి ఎ.శారద, బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ దావ స్వాతి మాట్లాడుతూ ప్రతీపనిలో, ఆలోచనలో సైన్స్ ఉంటుందని గ్రహించాలన్నారు. మార్కుల కోసం కాకుండా విద్యార్థులు నాలెడ్జి కోసం చదవాలన్నారు. ప్రిన్సిపాల్ పీఆర్ నిరుపమ మాట్లాడుతూ ఎగ్జిబిషన్‌లో 118 సైన్స్, మ్యాథమెటిక్స్, రోబోటిక్స్ ప్రదర్శనలు వచ్చాయని, ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాల నుండి 59 గురుకుల పాఠశాలల విద్యార్థులు, 118 మంది ఎస్కార్ట్ గైడ్ టీచర్లు పాల్గొంటున్నారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు, ఆలపించిన గేయాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రవూఫ్ ఖాన్, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ దుర్గాప్రసాద్, జిల్లా సైన్స్ సెంటర్ అధికారి (ఎఫ్‌ఏసీ) రాజగోపాల్, డీఐఈవో సీహెచ్ మదార్ గౌడ్, ఎంఈవో జె.పోచయ్య, గురుకులాల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.


