రోడ్డుకు ఎడమ వైపున వాహనాలను నడపాలి.
ఎడమ వైపు మలుపు తిరుగుతున్నప్పుడు రోడ్డుకు ఎడమ వైపు వెళ్లాలి.
ముందు వెళ్లే వాహనాన్ని కుడివైపు నుంచి ఓవర్ టేక్ చేయాలి.
రహదారి కూడళ్లు, రోడ్డు మలుపులకు ముందు, జీబ్రా క్రాసింగ్ వద్ద వాహన వేగాన్ని తగ్గించాలి.
జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులు రోడ్డు దాటేందుకు అవకాశమివ్వాలి.
రద్దీగా ఉన్నప్పుడు మలుపు తిరగరాదు.
రోడ్డు మలుపు, కూడలి, కొండ అంచుల వద్ద, వాగులు, వంతెనలు, ట్రాఫిక్ దీపాలు, జీబ్రా లైన్లు ఉన్న చోట, వేగంగా వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారులపై, పార్కింగ్ నిషేధిత ప్రాంతాల్లో, కాలిబాటకు అడ్డంగా వాహనాలు నిలుపరాదు.
మంచిర్యాలక్రైం: ఎర్ర దీపాన్ని బేఖాతార్ చేశారో మృత్యు కౌగిట బందీ అయినట్లే.. మందు కొట్టి వాహనం నడిపారో నిండు ప్రాణాలు గాల్లో కలిసినట్లే.. వాయువేగంతో దూసుకెళ్తున్నారో మరణానికి దగ్గరవుతున్నట్లే.. అంతా తెలిసినా ఏమవుతుందిలే అన్న ధోరణిలో వాహనాలపై ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. అడ్డూ అదుపు లేకుండా దూసుకెళ్తూ విలువైన ప్రాణాలు కోల్పోతున్నారు. అయిన వారికి తీరని దుఃఖాన్ని మిగుల్చుతున్నారు. కన్నబిడ్డలు, కట్టుకున్న వారిని ఒంటరి చేస్తున్నారు. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ద్విచక్ర వాహనాలపై యువత విన్యాసాలు చేస్తూ జీవితాన్ని అంధకారం చేసుకుంటున్నారు. యథేచ్ఛగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. సిగ్నల్ పడినా రయ్‌మంటూ దూసుకెళ్తూ ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటివి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో గత మూడేళ్లలో అతివేగానికి సంబంధించి 67,537 కేసులు నమోదయ్యాయి. రూ.7.18కోట్ల జరిమానా విధించారు. అయినా వాహనదారుల్లో మార్పు రావడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు. కమిషనరేట్ పరిధిలో 70శాతం అతివేగంగా కారణంగా జరిగిన ప్రమాదాలేనని లెక్కల ద్వారా తెలుస్తోంది.
వాహనదారుల నిర్లక్ష్యం..
రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీసులు ప్రతీ రోజు వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్‌లపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. వేగ నియంత్రణకు స్పీడ్ లేజర్ గన్‌తో పర్యవేక్షిస్తున్నారు. రోజుకు రూ.లక్షల్లో జరిమానా విధించినా వాహనదారుల నిర్లక్ష్యమే నిండు ప్రాణాలు బలి తీసుకుంటోంది. రహదారులపై ప్రమాదాలు జరిగే స్థలాల్లో హెచ్చరిక బోర్డులు, వేగ నియంత్రణ సూచికలు లేవు. ప్రమాదకర మూలమలుపు వద్ద కనీసం నెమ్మదిగా వెళ్లాలనే హెచ్చరిక బోర్డులు కూడా కనిపించడం లేదు. రెప్పపాటు వ్యవధిలో జరిగిపోతున్న ప్రమాదాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. ఈ నెల 7న నగర శివారు పరిధిలోని జాతీయ రహదారిపై ముగ్గురు యువకులు మంచిర్యాల నుంచి హాజీపూర్ వైపు ఒకే మోటారుసైకిల్‌పై వెళ్తూ గుడిపేట పెట్రోల్‌బంక్ సమీపంలో లారీని ఓవర్‌టేక్ చేయబోయి అదే లారీ కింద పడి మృతిచెందారు.
ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి
వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. పలు సూచనలు చేస్తున్నారు.


