కరువును జయించేలా కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

కరువును జయించేలా కార్యాచరణ

Nov 12 2026 12:07 AM | Updated on Nov 12 2026 12:07 AM

వీబీజీ రామ్‌జీలో ముమ్మరంగా పనులు

తాగునీటిని సంరక్షిస్తూ వృథా అరికట్టాలి

ఆరుతడి పంటలు, రైతులకు రుణాల వెసులుబాటు

ఎల్‌నినోను ఎదుర్కొనేందుకు జిల్లాలో యాక్షన్‌ ప్లాన్‌

‘సాక్షి’తో జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘ఎల్‌నినో కారణంగా వర్షాభావ పరిస్థితులతో రాబోయే కరువును ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉంది. కరువుపై యాక్షన్‌ ప్లాన్‌ సిద్ధం చేసి అమలు చేస్తున్నాం. జిల్లాలో కరువును జయించేలా ప్రత్యేకంగా కార్యాచరణ కొనసాగుతోంది..’ అని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. జిల్లాలో కరువు యాక్షన్‌ ప్లాన్‌, అమలుపై బుధవారం ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆయన మాటల్లోనే వివరాలు..

తాగునీటి సమస్య లేదు

వచ్చే వేసవి దృష్ట్యా తాగునీటి సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాం. ఎల్లంపల్లి ఇన్‌టెక్‌వెల్‌, ఆసిఫాబాద్‌ మండలం అడ నుంచి రెండువైపులా తాగునీటి సరఫరా ఉంటుంది. సరిపడా నిల్వలు ఉండడంతో ఎక్కడా నీటి ఎద్దడి రాదు. 307గ్రామ పంచాయతీల్లో బోర్లకు మరమ్మతులు చేయిస్తూ పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తున్నాం. ఎక్కడా ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. అమృత్‌ పథకం కింద పనులు వేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. విద్యుత్‌ డిమాండ్‌ క్రమంగా పెరుగుతోంది. గతేడాది కంటే 30శాతం అధికంగా వినియోగం ఉంది.

వీబీజీరామ్‌జీలో ముమ్మరంగా పనులు

వీబీజీరామ్‌జీలో ముమ్మరంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రతీరోజు మొత్తం కూలీల్లో 60శాతానికి పైగా పనులకు హాజరవుతున్నారు. వాననీటిని ఒడిసి పట్టేలా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫాం పాండ్‌లు 4,080లక్ష్యానికి గాను ఇప్పటికే 615గ్రౌడింగ్‌ పూర్తయ్యాయి. మరో 180 పూర్తయ్యాయి. ఇంకుడుగుంతలు, పశువుల పాకలు, ఫాం పాండ్స్‌ నిర్మాణంలో ఉన్నాయి. 307 పంచాయతీల్లో ఇప్పటికే 55పూర్తయ్యాయి. ఇంటి అనుమతికి కచ్చితంగా ఇంకుడుగుంతలు, పశువులకు తాగునీటి కొరత రాకుండా నీటితొట్టిలు నిర్మిస్తున్నాం. పశుగ్రాసం కొరత లేకుండా సామూహికంగా చెరువులు, కుంటల్లో గడ్డి క్షేత్రాలను పెంచేలా చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పటివరకు 42మంది రైతులకు ఉచితంగా గడ్డి విత్తనాలు అందజేశాం. ఒకేచోట గడ్డి పెంపకం చేపట్టాం.

ఆరుతడి పంటలే సాగు

వానాకాలంలో కరువుతో జిల్లాలో పెద్దగా నష్టం జ రగలేదు. యాసంగిలో నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకుని జిల్లాలో పూర్తిగా ఆరుతడి పంటలే వేయాలని రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. దీంతో తొలిసారిగా జిల్లాలో జొన్న వంటి పంట ల వైపు మొగ్గు చూపుతున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 300ఎకరాల్లో కూరగాయలు, 138ఎకరా ల్లో వేరుశనగ, జొన్న 4ఎకరాల్లో సాగవుతోంది.

రైతు రుణాలకు వెసులుబాటు

కరువు కారణంగా సకాలంలో రుణాలు చెల్లించని క్రమంలో రైతులకు పంట రుణాల్లో స్వల్పకాలిక రుణాలను దీర్ఘకాలిక రుణాల కింద మార్చేందుకు ఆదేశాలు వచ్చాయి. అన్ని బ్యాంకులకు ఇప్పటికే ఆదేశాలిచ్చాం. జిల్లాలో రైతులకు కొంత వెసులుబాటు కలుగుతుంది.

నీటిని వృథా చేస్తే చర్యలు

భూగర్భ జలాలను అందరూ పొదుపుగా వాడుకోవాలి. ఎక్కడైనా కొత్త బోరు వేస్తే కచ్చితంగా అనుమతి తీసుకోవాలి. ఆర్వో ప్లాంట్ల యాజమాన్యాలు నీటి శుద్ధీకరణంలో నీటిని వృథా చేయరాదు. విడుదలైన నీటిని మళ్లీ భూమిలో ఇంకేలా నిర్మాణాలు చేపట్టాలని ఆదేశాలిచ్చాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement