● రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
పాతమంచిర్యాల: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర భూ రీ సర్వే లక్ష్యాలకు అనుగుణంగా కచ్చితత్వంతో పూర్తి చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఆర్డీఓలు, సర్వేల్యాండ్ రికార్డుల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ తరతరాలుగా కొనసాగుతున్న భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడంతోపాటు భూ యజమానికి కచ్చితమైన సరిహద్దులు, హక్కులు కల్పించడమే ముఖ్య ఉద్దేశ్యమని తెలిపారు. రాష్ట్రంలో 2,720 గ్రామాల్లో రీ సర్వే చేపట్టగా 416 గ్రామాల్లో పూర్తయిందని, మిగతా గ్రామాల్లో పనులు వేగవంతం చేయాలని అన్నారు. పాత రికార్డులు పరిశీలించి క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు సరిపోల్చుకోవాలని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని భూముల సరిహద్దులు నిర్ణయించి డిజిటల్ రూపంలో భద్రపర్చాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ రాములు, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, ఆర్డీఓ శ్రీనివాసరావు, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.


