మంచిర్యాలఅర్బన్: బస్టాండ్లలో ప్రయాణికుల భద్రతపై ఆర్టీసీ యాజమాన్యం విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతోంది. బస్‌డిపోలు, ప్రయాణ ప్రాంగణాల్లో నేరాలు, చోరీలు, వేధింపులు అరికట్టడంతోపాటు ప్రయాణికుల రాకపోకలపై నిరంతర పర్యవేక్షణకు సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ప్రధాన బస్టాండ్లలో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటుకు నిర్ణయించింది. వాటిని నేరుగా హైదరా బాద్ ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్ భవన్ క మాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించడం ద్వారా నిఘా వ్యవస్థ పటిష్టం కానుంది. కొ న్ని చోట్ల స్థానికంగా డిపో అధికారులు, మరికొనిప్రాంతాల్లో పోలీసుశాఖ కంట్రోల్ రూమ్‌లు పర్యవేక్షిస్తుండగా బస్ భవన్‌తో అనుసంధానం ద్వారా అ త్యున్నత స్థాయి నిఘా అందుబాటులోకి రానుంది.
కేంద్రీకృత పర్యవేక్షణ
రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లలో జరిగే పరిణామాలను హైదరాబాద్‌లోని ఆర్టీసీ ఉన్నతాధికారులు 24గంటలు ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం ఉంటుంది. పండుగలు, జాతరలు, అత్యవసర సమయాల్లో ప్రయాణికుల రద్దీ పెరిగితే అధికారులకు వెంటనే సమాచారం తెలియనుంది. రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు కేటాయించేందుకు నిమిషాల వ్యవధిలో నిర్ణయాలు తీసుకోవచ్చు.
భద్రతపై నిరంతర నిఘా
సీసీ టీవీ కెమెరా ఏర్పాటుతో భద్రతపై నిరంతర నిఘా సాగనుంది. మహిళలపై ఆకతాయిల వేధింపులు, జేబు దొంగతనాలు, అనుమానాస్పద వ్యక్తుల సంచారాన్ని బస్ భవన్ నుంచి కంట్రోల్ రూం సిబ్బంది ఎప్పటికప్పుడు గుర్తిస్తూ స్థానిక అధికారులను అప్రమత్తం చేయవచ్చు. పారిశుద్ధ్యం, విచారణ కౌంటర్లు, ఫ్లాట్‌ఫారాలపై బస్సుల వేళలు, సిబ్బంది ప్రయాణికులకు అందించే సేవల తీరును ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తారు.


