నా పేరు బొగె పోచం. చెన్నూర్‌లో ఎకరానికి రూ.30వేల చొప్పున రెండెకరాలు కౌలుకు తీసుకుని సాగు చేశా. మొదట పంట బాగానే వచ్చింది. వారం రోజుల నుంచి జెమిని వైరస్ సోకడంతో ఆకు ముడత పడుతుంది. ఇప్పటికే రూ.2లక్షలు పెట్టుబడి అయింది. పంటంతా ముడత పడుతుండడంతో పెట్టుబడి చేతికి వచ్చేలా లేదు. చేసిన అప్పులు తీర్చేదెలా.
చెన్నూర్: మిర్చి పంటకు జెమిని వైరస్ సోకడంతో దిగుబడిపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గత ఏడాది మిర్చి పంటకు డిమాండ్ ఏర్పడడంతో ఈ ఏడాది జిల్లాలో 1090 ఎకరాల్లో సాగైంది. ముందస్తు వర్షాలకు పంట ఏపుగా ఎదిగినప్పటికీ పూత సమయంలో బెబ్బిలి ముడత(జెమిని) వైరస్ సోకింది. వేలాది రూపాయలు వెచ్చించి మందులు పిచికారీ చేసినా ప్రయోజనం లేకుండా పోతోంది. మిర్చి పంట చేతికి వచ్చేసరికి పెట్టుబడి రూ.1.50లక్షలు అవుతోంది. కౌలు రైతులు మరో రూ.30వేలు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. వర్షాభావ పరిస్థితులు, వాతావరణంలో మార్పులతో బబ్బెర ముడత, జెమిని వైరస్ సోకింది. జెమిని వైరస్ అంటువ్యాధిలా వ్యాప్తి చెందుతోంది. ఒక చేను నుంచి పక్కనున్న చేనుకు వైరస్ సోకే ప్రమాదం ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరస్ సోకిన చెట్లు కుంచించి పోతున్నాయి. ఎదుగుదల తగ్గిన చెట్లను రైతులు తొలగిస్తున్నారు. ఆ చెట్టు ఉంటే మరో చెట్టుకు వైరస్ సోకే ప్రమాదం ఉంటుందని రైతు తనుగుల సంతోష్ తెలిపాడు. వైరస్ బెడద లేకుంటే ఎకరానికి 20 నుంచి 25క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. వైరస్ కారణంగా ఎకరానికి 10క్వింటాళ్ల దిగుబడి కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. పూత సమయంలో వైరస్‌తో తీవ్ర నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.
జిల్లాలో సాగు విస్తీర్ణం ఎకరాల్లో..
మండలం సాగు
కోటపల్లి 700
చెన్నూర్ 200
జైపూర్ 50
వేమనపల్లి 100
జన్నారం 40
మొత్తం 1090


