మంచిర్యాలటౌన్: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.925 కోట్లు మంజూరు చేసిందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు అన్నారు. నగరంలోని 60 డివిజన్లలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీసీ) నిర్మాణానికి నిధుల విడుదలపై హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో స్థానిక ఐబీ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ.925 కోట్లలో 70శాతం వాటా రూ.647.50 కోట్లు ప్రపంచబ్యాంకు, 30శాతం వాటా రూ.277.50 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానివని తెలిపారు. మూడేళ్లలో నగరం మొత్తం భూగర్భ మురుగు కాల్వల నిర్మాణం, ఆ నీటిని శుద్ధి చేసేందుకు ఎస్టీపీల నిర్మాణం చేపడుతామని తెలిపారు. అనంతరం ఐబీ చౌరస్తా నుంచి ఎం కన్వెన్షన్ హాల్ వరకు కాంగ్రెస్ నాయకులతో పాదయాత్ర చేశారు.
కాంగ్రెస్ తెచ్చిన కరువు కాదు
రాష్ట్రంలో కాంగ్రెస్ తెచ్చిన కరువు అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయని తెలిపారు. కరువు వల్ల రైతులు రెండో పంట వేయవద్దని కోరారు. ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లో ఉన్న నీటితో ఖరీఫ్ పంటకు సరిపడా అందిస్తున్నామని, మంచిర్యాల నియోజకవర్గంలోని ముల్కల్ల వరకు కడెం కెనాల్ 42వ డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు నీరు రాకపోవడంతో గూడెం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ నెల 10వరకు సాగునీరు 20వేల ఎకరాలకు అందిస్తామని తెలిపారు. సింగరేణిలో మారుపేరు కుటుంబాలు 170 ఉన్నాయని, వారి సమస్య పరిష్కారంతోపాటు 160 మంది డిస్మిస్డ్ కార్మికులకు దశల వారీగా తిరిగి ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, టీపీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కార్పొరేటర్ తూముల నరేష్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బేనేష్, ఐఎన్టీయూసీ అధ్యక్షుడు పూదరి తిరుపతి పాల్గొన్నారు.


