కెరమెరి: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించే దండారీ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి జిల్లాలో 1000 గూడేల్లో గుస్సాడీ, దండారీ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ప్రభుత్వం ఒక్కో దండారీకి రూ.15వేలు ప్రకటించింది. ఆదివారం నుంచి కొన్ని చోట్ల ఉత్సవాలు ప్రారంభం కాగా రెండు రోజుల తర్వాత దండారీలు నిర్వహించే ప్రతీ గ్రామంలో గుస్సాడీ ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో దండారీ సమూహాలుగా చేరి నృత్యాలు ప్రదర్శిస్తారు. నెమలి ఈకలు పొదిగిన టోపీ, తలపాగా, కృత్రిమ మీసాలు, గడ్డాలు, జింక లేదా మేక చర్మాన్ని ధరిస్తారు. డప్పులతో పాటు పేప్రే, తుడుం, కాలికోమ్ తదితరాలను వాయిద్యాలుగా వినియోగిస్తారు. భోగి నుంచి ప్రారంభమై కోలబోడికి దండారీ ఉత్సవాలు ముగుస్తాయి.
భోగితో ప్రారంభమై.. కోలబోడితో ముగింపు..
భోగి పండుగలతో దండారీలు ప్రారంభమవుతాయి. గుస్సాడీ, దండారీ ఏ గ్రామంలో ఉంటుందో ఆ గ్రామంలో వారు భోగి పండుగ నిర్వహిస్తారు. అదే రోజు నుంచి గుస్సాడీ నృత్యాలు ప్రారంభమవుతాయి. దండారీల్లో అనేక రకాలున్నాయి. భేటికోలా, మానుకోల, సదర్‌కోలా, కోడల్‌కోలా, కలివల్‌కోలా వంటి అనేక రకాలు ఉండగా వాటిలో కోలలతో మహిళలు, పురుషులు దండారీ నృత్యాలు చేస్తారు. చివరి రోజు కోలబోడి చేస్తారు. ఆ రోజు గ్రామస్తులు, పెద్దలు గ్రామ శివారులో ఉన్న జమ్మిచెట్టు వద్దకు వెళ్లి ప్రత్యేక పూజలు చేస్తారు. అక్కడే ఆభరణాలు ఓ చెట్టుకు కట్టేసి హారతి ఇస్తారు.


