నార్నూర్: గుజరాత్ రాష్ట్రంలో నిర్వహించిన రాష్ట్రీయ ఏక్తాదివస్ వేడుకల్లో తెలంగాణ ఆది వాసీ డప్పు కళాకారులు తమ అద్భుత ప్రదర్శనతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని శనివారం నిర్వహించిన కార్యక్రమంలో సంప్రదాయ డప్పుదరువులతో సభా ప్రాంగణాన్ని మార్మోగించారు. గాదిగూడ మండలం లోకారి కే రాజులగూడ గ్రామానికి చెందిన కళాకారులు తెలంగాణ ఆదివాసీ కళా వైభవాన్ని జాతీయ స్థాయిలో చాటిచెప్పారు. డప్పు కళాకారుల బృంద నాయకుడు కాత్లే శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆదివాసీ సంప్రదాయ కళలను, కళాకారుల ప్రతిభను గుర్తించి జాతీయ స్థాయి వేదికపై తమకు అవకాశం కల్పించిన ఆదివాసీ సకల కళా సంక్షేమ సంఘం డైరెక్టర్ కాత్లే శ్రీధర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కళాకారులు తిరుపతి, ప్రవీణ్, ఆనంద్, కార్తీక్, శంకర్, రాము, మధు, మోహన్, వీరేష్, శేఖర్, రవి కిరణ్, అభిషేక్, జంగు, చరణ్, హర్షవర్ధన్, అఖిల్, ఆంజనేయం, పవన్ ఉన్నారు.
వడ్డీ వ్యాపారిపై కేసు నమోదు
ఆదిలాబాద్‌టౌన్: ప్రజల నుంచి అధిక వడ్డీ వసూలు చేస్తున్న ఆదిలాబాద్ పట్టణంలోని ద్వారకానగర్‌కు చెందిన నాళం కృష్ణపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ సునీల్ కుమా ర్ ఆదివారం తెలిపారు. ప్రజలకు డబ్బులను వడ్డీ రూపంలో అప్పుగా ఇచ్చి అధికవడ్డీతో వసూలు చేయడంతో పాటు వారి వద్ద నుంచి చెక్కులు, డాక్యుమెంట్లు, ప్రామిసరీ నోట్లను తన వద్ద తనఖా పెట్టుకుంటున్నారని తెలిపా రు. ఆయన నుంచి వాటిని స్వాధీనం చేసుకున్నట్లుగా వివరించారు.


