కాగజ్‌నగర్‌టౌన్: హైదరాబాద్ –సిర్పూర్ కాగజ్‌నగర్ –బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ (17011/12) రైలు ఈ నెల 3 నుంచి జర్మన్ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆధునిక ఎల్‌హెచ్‌బీ (లింక్ హాఫ్ మ్యాన్ బుస్క్) బోగీలతో నడువనుంది. ఇన్నాళ్లు ఈ రైలు పాత పసుపుపచ్చ రంగు ఐసీఎఫ్ బోగీలతో నడుస్తోంది. ఐసీఎఫ్ రైలులో 16 బోగీలు ఉండగా, ఎల్‌హెచ్‌బీగా అప్‌గ్రేడ్ అయిన తర్వాత 14 బోగీలతో నడువనుంది. ఐసీఎఫ్ బోగీల కంటే ఎల్‌హెచ్‌బీ బోగీల్లో సీటింగ్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. ఇంటర్‌సిటీ రైలుకు సికింద్రాబాద్ –భద్రాచలం రోడ్ కాకతీయ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్ –కర్నూల్ సిటీ, హైదరాబాద్ హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైళ్లతో రేక్ షేరింగ్ ఉంది. అలాగే ఇటీవల బతుకమ్మ పండుగ సమయంలో నడిపించిన 07711/12 సికింద్రాబాద్ –సిర్పూర్ కాగజ్‌నగర్ పండుగ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ కూడా రేక్ షేరింగ్‌తో నడుస్తోంది. ప్రస్తుతం ఇంటర్ సిటీ, కాకతీయ, హంద్రీ రైళ్లు దశల వారీగా నవంబర్ 3, 4, 5 తేదీల్లో ఎల్‌హెచ్‌బీ బోగీలుగా మారనున్నాయి. దీంతో 07711/12 పండుగ ప్రత్యేక రైలుకు ప్రస్తుతం నడుస్తున్న ఐసీఎఫ్ బోగీలనే పూర్తి స్థాయిలో కేటాయించనున్నారు.
మెరుగుపడనున్న సమయపాలన
ఇప్పటి వరకు ప్రత్యేక రైలు హైదరాబాద్‌కు ఆలస్యంగా చేరుకుంటుండడంతో మరునాడు ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరే ఇంటర్ సిటీ రై లుపై తీవ్ర ప్రభావం పడుతోంది. గత 15 రోజు లుగా 17012 బీదర్ ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రాత్రి 9.30 గంటల నుంచి 10.30 గంటల మధ్య చేరుకోవాల్సి ఉండగా 3 నుంచి 4 గంటలు ఆలస్యంగా సికింద్రాబాద్ జంక్షన్‌కు చేరుకుంటోంది. దీంతో రోజు వారీ ఉద్యోగులు, విద్యార్థులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. నవంబర్ 4 నుంచి ఇంటర్ సిటీకి ప్రత్యేక రైలు రేక్ షేరింగ్ బాధలు తప్పనున్నాయి. సమయపాలన మెరుగుపడనుంది.
బోగీలు పెంచాలని డిమాండ్
ప్రస్తుతం భాగ్యనగర్, కాగజ్‌నగర్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఎల్‌హెచ్‌బీ బోగీలతో 20 నుంచి 22 బోగీలతో నడుస్తున్నాయి. అదే తరహాలో ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎల్‌హెచ్‌బీ బోగీలను 14 నుంచి 22 వరకు పెంచాలని, పెరుగుతున్న ప్రయాణికుల తాకిడిని తట్టుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు.


