లీజు పేరుతో రైతుల ట్రాక్టర్లు మాయం | - | Sakshi
Sakshi News home page

లీజు పేరుతో రైతుల ట్రాక్టర్లు మాయం

Nov 1 2026 11:59 PM | Updated on Nov 1 2026 11:59 PM

● ప్రధాన నిందితుడితో పాటు నలుగురు స్థానిక ఏజెంట్లు అరెస్ట్‌ ● రూ.40లక్షల విలువైన 6 ట్రాక్టర్లు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్‌ ఎస్పీ అఖిల్‌ మహాజన్‌

ఆదిలాబాద్‌టౌన్‌: ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లించలేని రైతులను లక్ష్యంగా చేసుకుని, లీజు పేరుతో నమ్మించి ట్రాక్టర్లను మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్‌ చేసినట్లు ఎస్పీ అఖిల్‌ మహాజన్‌ తెలిపారు. జిల్లాకేంద్రంలోని పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లోని సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ కేసులో ఆరు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని, ప్రధాన నిందితుడితో పాటు జిల్లాకు చెందిన నలుగురు ఏజెంట్లను అరెస్ట్‌ చేసినట్లు పేర్కొన్నారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన యోగేష్‌ పాటిల్‌, సోహెల్‌ రెహాన్‌, ఆసిఫ్‌లు పితాంబర్‌, అంబరావులతో కలిసి ముఠాగా ఏర్పడి జిల్లాలోని ఫైనాన్స్‌ ద్వారా ట్రాక్టర్‌ తీసుకున్న యజమానులను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ట్రాక్టర్లపై ఉన్న ఫైనాన్స్‌ బకాయిలను తామే చెల్లిస్తామని నమ్మించి, లీజు ప్రాతిపదికన ట్రాక్టర్లను తీసుకుని మహారాష్ట్రకు తరలించినట్లు పేర్కొన్నారు. ఇంద్రవెల్లి మండలంలో 4, బేల మండలంలో 3, ఉట్నూర్‌ మండలంలో 1, తాంసి మండలంలో 1 చొప్పున మొత్తం 9 ట్రాక్టర్లను తరలించినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఈ ముఠాకు స్థానికంగా కొందరు వ్యక్తులు సహకరిస్తూ రైతులను నమ్మించి ట్రాక్టర్లను అప్పగించేలా చేశారని, ఇందుకు గాను ఒక్కో ట్రాక్టర్‌కు రూ.10వేల చొప్పున కమిషన్‌ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. రెండు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టగా, ఒక బృందం మహారాష్ట్రలోని అమరావతికి వెళ్లి 5 ట్రాక్టర్లను, మరో బృందం చిక్లీ ప్రాంతంలో ఒక ట్రాక్టర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మొత్తం 6 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని, ఈ మోసానికి పాల్పడిన ప్రధాన నిందితుడు మహారాష్ట్రలోని అమరావతికి చెందిన యోగేష్‌ పాటిల్‌తో పాటు స్థానికంగా సహకరించిన నలు గురు నిందితులు ఇంద్రవెల్లికి చెందిన కుమ్మరి శ్యా మ్‌ రావు, వాగుమారి కేశవ్‌, పితాంబర్‌, ఉట్నూర్‌లో ని నర్సాపూర్‌కు చెందిన అంబరావ్‌లను అరెస్ట్‌ చేశామని తెలిపారు. వారి వద్ద నుంచి జాన్‌డీర్‌ 2, స్వరాజ్‌ 2, మహీంద్రా 1, పవర్‌ ట్రాక్‌ 1 చొప్పున ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఫైనాన్స్‌ వాయిదాలు చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న ట్రాక్టర్‌ యజమానులు లీజు పేరుతో వచ్చే గుర్తుతెలియని వ్యక్తులను నమ్మి తమ వాహనాలను అప్పగించవద్దని ఎస్పీ సూచించారు. ఫైనాన్స్‌ బకాయిలు చెల్లిస్తామని చెప్పే వ్యక్తుల వివరాలను పూర్తిగా పరిశీలించాలని, ఇలాంటి అనుమానాస్పద వ్యక్తులు, మోసాలపై వెంటనే సమీప పోలీస్‌ స్టేషన్‌కు సమాచారం అందించాలని కోరారు. ఇంకా బాధితులు ఉంటే నిర్భయంగా జిల్లా పోలీసులను సంప్రదించాలని, వారికి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఉట్నూర్‌ ఏఎస్పీ రుత్విక్‌ సా యి కొట్టే, ఉట్నూర్‌ సీఐ ఎం.ప్రసాద్‌, ఇంద్రవెల్లి ఎ స్సై సాయన్న, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement