ఆర్టీసీలో యూనియన్ ఎన్నికల హోరు రంగంలోకి దిగిన రాజకీయ పార్టీలు టీడబ్ల్యూయూకు మద్దతు పలికిన అధికార కాంగ్రెస్
గుర్తింపు పోరు..
మంచిర్యాలఅర్బన్: తెలంగాణ ఆర్టీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఆదిలాబాద్ రీజియన్‌లో పొలిటికల్ హీట్ పెరిగింది. సాధారణంగా ఆర్టీసీ ఎన్నికలకు దూరంగా ఉండే రాజకీయ పార్టీలు రంగంలోకి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈఎన్నికల్లో తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్‌కు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటించింది. ఎన్నికల సమన్వయం కోసం ఇన్‌చార్జీలను కూడా నియమించారు. డిపోల వారీగా టీడబ్ల్యూయూ(ఐఎన్‌టీయూసీ) స్థానిక నేతలతో శాసనసభ్యులు సమాలోచనలు జరుపుతున్నారు. ఎంప్లాయీస్ యూనియన్ తరఫున సీపీఐ నేతలు రంగంలోకి దిగటంతో రాజకీయ వేడి రగులుతోంది.
టీడీపీ తరహాలోనే కాంగ్రెస్..
గతంలో టీడీపీ హయాంలో టీఎన్‌టీయూసీ ఏర్పాటుతో రాజకీయ జోక్యం మొదలైంది. ప్రస్తుతం అధికారంలోని కాంగ్రెస్ నేతలు టీడబ్ల్యూయూ, ఐఎన్‌టీయూసీ తరఫున కీలక నాయకులకు పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. గతంలో ఆర్టీసీ ఎన్నికల్లో పార్టీల జోక్యం లేని పరిస్థితుల్లో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం నేరుగా రంగంలోకి దిగింది. ఎమ్మెల్యే, ఎంపీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆర్టీసీ కార్మిక పరిషత్ (టీఎన్‌టీయూసీ)ను బరిలోకి దింపినా ఎన్‌ఎంయూ 1502 మెజార్టీతో విజయబావుటా ఎగురవేసింది. టీఎన్‌టీయూసీ 854 ఓట్లతో రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తర్వాత కాలంలో 2005లో జరిగిన ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్, 2008లో ఎన్‌ఎంయూ, 2012లో ఈయూ రాష్ట్రస్థాయిలో విజయం సాధించగా టీఎంయూ పోటీదారుగా అవతరించింది. 2016లో తెలంగాణ విభజన తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పరోక్ష మద్దతుతో ఆదిలాబాద్ రీజియన్‌లో టీఎంయూ గెలుపొందింది. సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో టీడబ్ల్యూయూ బరిలోకి దిగటంతో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.
నాడు ఒంటరిగా.. నేడు కూటమిగా..
ఆర్టీసీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి తలపడ్డ సంఘాలు కూటమిగా బరిలోకి దిగుతున్నాయి. ఎన్‌ఎంయూ, టీఎంయూ, ఈయూ సంఘాల మధ్య హోరాహోరీగా సాగిన గుర్తింపు పోరులో ఒక్కోసారి ఒక్కో యూనియన్ విజయాన్ని సాధించాయి. 2001 నుంచి 2016 వరకు పోటీలో గెలుపొందిన ఎన్‌ఎంయూ, టీఎంయూ, ఈయూలు జతకట్టి ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. కాగా టీఎంయూకు చెందిన బాణం గుర్తును ఈసారి టీడబ్ల్యూయూకు కేటాయించడం గమనార్హం.
సగానికి తగ్గిన ఓటర్లు..
ఆదిలాబాద్ రీజియన్‌లో కార్మిక ఓటర్ల సంఖ్య సగానికి పడిపోయింది. 2001లో 3000లకు పైగా ఓట్లు ఉండగా 2026 నాటి సంఖ్య ఏకంగా 1773కు తగ్గిపోయింది. ప్రైవేట్ బస్సుల నిర్వహణ పెరగడం, కొత్త నియామకాలు చేపట్టకపోవటంతో ఆర్టీసీలో ఓటర్ల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. యూనియన్లు బలహీనపడటం.. రెగ్యులర్ డ్రైవర్లు, సిబ్బంది స్థానంలో ప్రైవేట్, కాంట్రాక్టు పద్ధతిన కార్మికులను విధుల్లోకి తీసుకోవడం అంతకంతకు పెరిగిపోతోంది. పదేళ్ల తర్వాత జరుగుతున్న ఎన్నికల్లో కార్మిక వర్గం ఎవరి పక్షాన నిలుస్తారో ఉత్కంఠ నెలకొంది.


