‘వందేభారత్‌’కు ఏడాది | - | Sakshi
Sakshi News home page

‘వందేభారత్‌’కు ఏడాది

Sep 29 2026 12:33 AM | Updated on Sep 29 2026 12:33 AM

● కాగజ్‌నగర్‌ నుంచి 3,690 మంది ప్రయాణం ● రూ.30 లక్షలకు పైగా ఆదాయం

కాగజ్‌నగర్‌టౌన్‌: నాగ్‌పూర్‌ –సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు కాగజ్‌నగర్‌ మీదుగా ప్రారంభమై ఏడాది పూర్తి చేసుకుంది. అత్యంత వేగవంతమైన ప్రయాణం, ఆధునిక సౌకర్యాలతో ఈ రైలు ఏడాదిలోనే ప్రయాణికుల్లో చెరగని ముద్ర వేసింది. ఏడాది కాలంలో కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌కు 3,690 మంది వందేభారత్‌లో ప్రయాణించారు. దీని ద్వారా రైల్వే శాఖకు రూ.30,44,250ల ఆదాయం సమకూరింది. ప్రతీరోజు కాగజ్‌నగర్‌ నుంచి సగటున 15 మంది ఈ రైలులో సికింద్రాబాద్‌కు ప్రయాణిస్తుండడం విశేషం.

బోగీల కుదింపు

మొదట 20 బోగీలతో ప్రారంభమైన ఈ రైలును తర్వాత 16 బోగీలకు కుదించారు. ప్రస్తుతం 8 బోగీలతో సికింద్రాబాద్‌ –నాగ్‌ఫూర్‌ మధ్య రాకపోకలు సాగిస్తోంది. ఈ రైలు పూర్తి నిర్వహణ (మెయింటనెన్స్‌)ను నాగ్‌పూర్‌లోనే జరుగుతుంది. సికింద్రాబాద్‌ నుంచి మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి వందేభారత్‌ కాగజ్‌నగర్‌కు సాయంత్రం 4.10 గంటలకు చేరుకుంటుంది. నాగ్‌పూర్‌ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరి కాగజ్‌నగర్‌కు ఉదయం 8.10 గంటలకు చేరుకుని కాగజ్‌నగర్‌లో 1 నిమిషం పాటు హాల్టింగ్‌ అనంతరం బయలు దేరి సికింద్రాబాద్‌కు 12.15 గంటలకు చేరుకుంటుంది. కాగజ్‌గనర్‌ నుంచి సికింద్రాబాద్‌కు 4 గంటల్లో చేరుకుంటుంది. ఈ రైలులో ప్రయాణిస్తే సమయం ఆదాతో పాటు వేగవంతమైన ప్రయాణాన్ని పొందవచ్చని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

సౌకర్యవంతమైన ప్రయాణం

వందేభారత్‌ రైలు కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లేందుకు చాలా అనుకూలంగా ఉంది. ఉదయం 8.10 గంటలకు ఎక్కితే మధ్యాహ్నం 12 గంటల వరకు సికింద్రాబాద్‌ స్టేషన్‌లో దిగొచ్చు. ఈ రైలు అత్యాధునిక టెక్నాలజీతో ఉండడంతో ఇందులో ఎంతో భద్రత ఉంది.

– చంద్రయ్య, కాగజ్‌నగర్‌

చార్జీలు తగ్గించాలి

వందేభారత్‌ రైలులో చార్జీలు ఎక్కువ కావడంతో సామాన్య, మధ్య తరగతి వారు ప్రయాణించడం లేదు. కాగజ్‌నగర్‌ నుంచి సికింద్రాబాద్‌కు రూ.800 చార్జీ ఉంది. దీనిని రూ.200 తగ్గించడంతో మరింత ఆదరణ పెరిగే అవకాశం ఉంది.

– ఫణిరాజ్‌,

ఉత్తర తెలంగాణ రైల్వే ఫోరం అధ్యక్షుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement