బెల్లంపల్లి/మంచిర్యాలఅర్బన్: రైల్వే పెండింగ్ పనులు ఏమాత్రం జాప్యం చేయకుండా సత్వరంగా పూర్తి చేయాలని సికింద్రాబాద్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్‌ఎం) డాక్టర్ ఆర్.గోపాలకృష్ణన్ సూచించారు. శుక్రవారం ఆయన బెల్లంపల్లి, మంచిర్యాల రైల్వేస్టేషన్ పరిధిలో రైల్వే అభివృద్ధి పనులను పరిశీలించారు. బెల్లంపల్లి మూడో ఫ్లాట్‌ఫామ్, మూడోలైన్ పనులు, ఆర్వోహెచ్ షెడ్, సిక్ లైన్ ఎక్స్‌టెన్షన్ తదితర పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అధికారులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయించాలని ఆదేశించారు. మంచిర్యాలలో అమృత్ భారత్ పథకం కింద రూ.26.49 కోట్లతో చేపట్టిన రైల్వేస్టేషన్ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. టికెట్ కౌంటర్లు, పార్కింగ్ ఏరియా, గార్డెనింగ్ పనులు, ఫుట్ ఓవర్‌బ్రిడ్జి, లిప్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్‌హాల్ పనులు పరిశీలన చేశారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలుగకుండా నాణ్యతా ప్రమాణాలతో పనులన్నీ త్వరగా పూర్తి చేయాలని సూచించారు. డీవోఎం నరేందర్‌శర్మ, మంచిర్యాల స్టేషన్ మేనేజర్ రవికుమార్, రామగుండం ఏడీఎంఏ, ఇతర విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


