అక్కడా.. ఇక్కడా పర్యవేక్షణెలా! | - | Sakshi
Sakshi News home page

అక్కడా.. ఇక్కడా పర్యవేక్షణెలా!

Jul 25 2026 1:53 AM | Updated on Jul 25 2026 1:53 AM

గందరగోళంగా హాస్టల్‌ వార్డెన్ల సర్దుబాటు

రెగ్యులర్‌ వార్డెన్‌లకు ఇన్‌చార్జి

ఒక్కో వార్డెన్‌కు మూడేసి బాధ్యతలు

వంద కిలోమీటర్ల దూరం వెళ్లేదెలా

మంచిర్యాలఅర్బన్‌: జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతిగృహాల్లో ఇన్‌చార్జీల నియామకం, బాధ్యతల(సర్దుబాటు) అప్పగింత వివాదాస్పదంగా మా రింది. అధికారులు నిబంధనలు పక్కనబెట్టి వ్యవహరిస్తుండడంతో గందరగోళం నెలకొంది. ఒక్కొక్కరికి ఏకంగా మూడే వసతిగృహాల పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. కిలోమీటర్ల దూరంలో ఉన్న వసతిగృహాలకు కూడా ఒక్కరినే ఇన్‌చార్జీగా నియమించడంతో ఏ ఒక్క హాస్టల్‌ను సరిగ్గా పర్యవేక్షించలేని పరిస్థితి ఏర్పడింది. వార్డెన్‌ ఒకే సమయంలో వేర్వేరు ప్రాంతాల్లోని హాస్టళ్లల్లో అందుబాటులో ఉండకపోవడంతో విద్యార్థుల భద్రత, ఆహార నాణ్యత, వసతుల పర్యవేక్షణ దెబ్బతింటోంది. అత్యవసర సమయాలు, తనిఖీ వేళ వార్డెన్‌ ఎప్పుడు, ఏ హాస్టల్‌లో ఉంటారో తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారు. నిరంతరం పరిశీలించే వార్డెన్లకు అదనపు బాధ్యతలు అప్పగించడంతో పర్యవేక్షణ లోపిస్తోంది.

ఎస్టీ హాస్టళ్లలో గందరగోళం

ఎస్టీ హాస్టళ్లలో సర్దుబాట్ల పర్వం కొనసాగుతోంది. అధికారుల తప్పిదంతో ఒక హాస్టల్‌కు నియమించిన రెగ్యులర్‌ వార్డెన్లకు తగిన స్థానం ఇవ్వకుండా దూర ప్రాంతాల హాస్టళ్లకు డిప్యూటేషన్లు, ఇన్‌చార్జీ లుగా నియమించడంతో నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. 2024లో మంచిర్యాల పీఎంహెచ్‌(గర్ల్స్‌) వార్డెన్‌ లక్సెట్టిపేటకు బదిలీ అయ్యారు. అప్పట్లో అన్యాయం జరిగిందని కోర్టుకు వెళ్లడంతో తిరిగి అధికారులు ఆమెను సర్దుబాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ఆ పోస్టు ఖాళీగా ఉండడం వల్ల కౌన్సెలింగ్‌ ద్వారా కొత్తగా వచ్చిన మరో రెగ్యులర్‌ వార్డెన్‌కు భీమారం డిప్యూటేషన్‌ ఇచ్చారు. కొంతకాలానికి అక్కడ పని చేసిన ఏటీడబ్ల్యూవో ఇన్‌చార్జి తిరిగి సొంత హాస్టల్‌కు రావడంతో లక్సెట్టిపేట పోస్టుమెట్రిక్‌(గర్ల్స్‌) హాస్టల్‌కు బదిలీ చేశారు. ఈ ఏడాది జరిగిన బదిలీల్లో మంచిర్యాల పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌(బాయ్స్‌) వార్డెన్‌ను లక్సెట్టిపేట(గర్ల్స్‌)కు కేటాయించారు. అప్పటికే అక్కడ పని చేస్తున్న మంచిర్యాల పీఎంహెచ్‌(రెగ్యులర్‌ వార్డెన్‌)ను ఎక్కడికి పంపించాలో అధికారులకు తెలియకుండా పోయింది. ఇదివరకు మంచిర్యాల బీసీ ఇంటిగ్రేటేడ్‌లో రెగ్యులర్‌ ఎస్టీ వార్డెన్‌ను జన్నారానికి డిప్యూటేషన్‌ చేశారు. లక్సెట్టిపేటకు రెగ్యులర్‌ వార్డెన్‌గా బదిలీపై వెళ్లిన అతన్ని ఇక్కడికి సర్దుబాటు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇలా ఒకరి కోసం మరొకరిని రెగ్యులర్‌ వార్డెన్లను ఇబ్బందులకు గురి చేశారు.

బీసీ ఒక్కొక్కరికి మూడేసి..

బీసీ వసతిగృహాల్లో ఒకే వార్డెన్‌కు హాస్టళ్ల అదనపు బాధ్యతలు అప్పగించడం వల్ల పర్యవేక్షణ లోపిస్తోంది. దండేపల్లిలో విధులు నిర్వర్తించే వార్డెన్‌కు జన్నారం, బెల్లంపల్లిలో రెగ్యులర్‌ వార్డెన్‌కు లక్సెట్టిపేట పోస్టుమెట్రిక్‌ హాస్టల్‌, మంచిర్యాల బీసీ బాలుర కళాశాల వసతిగృహం వార్డెన్‌కు లక్సెట్టిపేట ప్రీమెట్రిక్‌, మంచిర్యాల ఇంటిగ్రేటెడ్‌ హాస్టల్‌ అదనపు బాధ్యతలు ఇచ్చారు. జైపూర్‌ ప్రీమెట్రిక్‌(గర్ల్స్‌) వసతిగృహ నిర్వహణాధికారికి చెన్నూర్‌ గర్ల్స్‌, వేరే డిపార్ట్‌మెంట్‌ ఎస్సీ ప్రీమెట్రిక్‌ వసతిగృహ ఇన్‌చార్జీగా నియమించడం కొసమెరుపు.

ఎస్సీ వసతిగృహంలో మరోలా..

వసతిగృహాల్లో ఖాళీలు ఉంటే పక్కపక్కనే ఉండే మండలాల వార్డెన్లకు ఇంచార్జీలుగా నియమిస్తారు. ఎస్సీ వసతిగృహంలో వార్డెన్‌కు ఆరు, ఏడు మండలాలు దాటి ఇంచార్జీ బాధ్యతలు ఇవ్వడంపై విమర్శలు వస్తున్నాయి. 96 కిలోమీటర్ల దూరంలోని జన్నారం మండలం చింతగూడకు చెందిన రెగ్యులర్‌ వార్డెన్‌కు నెన్నెల వార్డెన్‌ ఇంచార్జీగా ఇచ్చారు. పోన్నారం వసతిగృహం ఓపెన్‌ చేయకముందే ఆ హాస్టల్‌ ఇంచార్జీగా నియమించడం చర్చానీయంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement