మంచిర్యాలఅగ్రికల్చర్: ఖరీఫ్ సాగుపై రైతులు ఆశలు వదులుకుంటున్న సమయంలో జిల్లాలో గత మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షం మళ్లీ ఆశలు చిగురింపజేసింది. అన్ని మండలాల్లో వర్షం కురుస్తుండడంతో పంటలకు ప్రాణం పోసింది. సోమవారం నుంచి బుధవారం వరకు 95.5మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. గత కొద్ది రోజులుగా వర్షాల్లేక ఎండలకు పంటలు వడలిపోయాయి. ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో మోస్తారు నుంచి భారీ వర్షం, ముసురు పడుతోంది. దీంతో పత్తి, మొక్కజొన్న, కంది, ఎదిగే దశలో ఉన్న నారుమడులకు ప్రయోజనం చేకూరింది. ఖరీఫ్ సాగు విస్తరించేందుకు దోహపడింది. ఇప్పటికే నారు పోసిన రైతులు నాట్లు వేసుకునేందుకు సిద్ధం కాగా.. మరికొందరు నారు అలుకుతున్నారు. ఇన్ని రోజులు బీడుగా ఉన్న పొలాలు వరినాట్లకు సిద్ధం చేస్తున్నారు.
23.7 మిల్లీమీటర్ల వర్షపాతం
జిల్లాలో బుధవారం 23.7మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జన్నారం మండలంలో 35.4మిల్లీమీటర్లు, దండేపల్లిలో 23.1, లక్సెట్టిపేటలో 19.5, హాజీపూర్‌లో 28, కాసిపేటలో 29.9, తాండూర్‌లో 30, భీమినిలో 25.3, కన్నెపల్లిలో 26.3, వేమనపల్లిలో 14.9, నెన్నెలలో 19.4, బెల్లంపల్లిలో 30.4, మందమర్రిలో 33.4, మంచిర్యాలలో 30.4, నస్పూర్‌లో 24.5, జైపూర్‌లో 16.2, చెన్నూర్‌లో 16.4, కోటపల్లిలో 11.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాలతో జలాశయాలు, చెరువుల్లోకి వరద నీరు చేరుతోంది. ఈ నెల 20న 13.4, 21న 58.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మొత్తంగా మూడు రోజుల్లో 95.5మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
అయినా లోటే..
జిల్లాలో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 380.4 మిల్లీమీటర్లు కాగా 305.7మిల్లీమీటర్ల వర్షం కురి సింది. ఇంకా 20శాతం లోటు నెలకొంది. దండేపల్లి మండలంలో అత్యధికంగా 64శాతం, 8మండలాల్లో 20నుంచి 30శాతం లోటు నమోదైంది. 4మండలాల్లో సాధారణం, తాండూర్, బెల్లంపల్లి మండలాల్లో 20శాతం అధిక వర్షపాతం నమోదైంది. వాతావరణ శాఖ ఏటా జూన్ ఒకటి నుంచి వర్షపాతం రికార్డు చేస్తుంది. ఆయా మండలాల్లో నిర్ణీత సంవత్సరాల్లో కురిసిన వర్షపాతాన్ని లెక్కించి సాధారణ వర్షపాతాన్ని నిర్ణయిస్తారు. సాధారణ వర్షపాతం కంటే ఒకటి నుంచి 19శాతం తక్కువైనా, ఎక్కువ రికార్డు అయినా సాధారణ వర్షపాతంగానే లెక్కిస్తారు. 60శాతం కన్న తక్కువగా నమోదైతే అత్యధిక లోటు, 20శాతం ఎక్కువ రికార్డు అయితే అధికం, 60శాతం ఎక్కువగా కురిస్తే అత్యధిక వర్షపాతంగా ప్రకటిస్తారు. వీటి ఆధారంగా కరువు మండలాలను ప్రకటిస్తారు.
ఇప్పటి వరకు సాగైన పంటలు
పంట ఎకరాల్లో
పత్తి 1,65,528
వరి 2,654
కంది 787
మొక్కజొన్న 33
పెసలు 20
ఇతర పంటలు 72
మొత్తం 1,69,104


